03-02-2026 02:08:06 AM
పదే పదే డిజైన్ల మార్పు.. కొరవడిన ఏపీ ప్రభుత్వ పర్యవేక్షణ
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ సాగునీటి అవసరా లకు, జలవిద్యుత్ ప్రాజెక్టులకు, గోదావరి వరదల నియంత్రణకు పోలవరం ప్రాజెక్ట్ ఆయువుపట్టు. ఈ బహుళార్థసాధక ప్రాజెక్టు రాష్ట్ర భవిష్యత్తును మార్చగల కల్పవృక్షం. అయితే.. గడిచిన కొంతకాలంగా ప్రాజెక్ట్ వివాదాలకు కేంద్ర బిందు వుగా మారింది. పదే పదే డిజైన్ల మార్పు, పనుల్లో ఏళ్ల కొద్దీ జాప్యం.. ప్రాజెక్ట్ను అనిశ్చితిలోకి వెళ్లేలా చేశాయి.
గడిచిన పదేళ్లలో ప్రాజెక్ట్ వ్యయం అమాంతం పెరిగింది. 2026 జనవరి నాటికి ఆ మొత్తం రూ.62,436 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం పనులు పూర్తి చేసే గడువు గరిష్టంగా 2028 మార్చి వరకు పెరిగింది. ‘మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్’ (మెయిల్) కాంట్రాక్ట్ సంస్థ ప్రస్తుతం ప్రాజెక్ట్ పరిధిలోని స్పిల్ వే, గ్యాప్-3 కాంక్రీట్ డ్యాం, ఎర్త్ కమ్ రాక్ఫెల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాంలోని కీలక విభాగాలు నిర్మిస్తున్నది.
అయితే.. ఈ కాంట్రాక్ట్ సంస్థ చేపట్టిన కొన్ని సాగునీటి ప్రాజెక్ట్ పరిధిలో వైఫల్యాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో నిర్మిస్తున్న సుంకిశాల ఇన్టెక్ వెల్, పంప్ హౌస్ కాంప్లెక్స్ గోడ గతేడాది కుప్పకూలింది. కాళేశ్వరం వంటి అతిపెద్ద ఎత్తిపోతల పథకం పరిధిలో ఇదే సంస్థ నిర్మించిన కన్నెపల్లి భూగర్భ పంప్ హౌస్ కూడా వరదలకు దెబ్బతిన్నది. అక్కడ గోడలు పగిలి పంపులు ధ్వంసమయ్యాయి. మొత్తానికి వరదల ఒత్తిడిని తట్టుకోవడంలో ఆ సంస్థ చేపట్టిన నిర్మా ణాలు పూర్తి విఫలమయ్యాయనేది సుస్పష్టం. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పటిష్టతపైనా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రాజెక్ట్ పనులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గత నెల 19 నుంచి 22 వరకు ప్రత్యేక నిపుణుల బృందం ప్రాజెక్ట్ పనులపై అధ్యయనం చేసింది. బృందంలో డేవిడ్ బీ పాల్ (యూఎస్‌ఏ), సీన్ హింబ్బెర్గర్ (కెనడా), జియాన్ ఫ్రాంకో దీసిక్కో (యూఎస్‌ఏ) వంటి ప్రఖ్యాత ఇంజినీరింగ్ నిపుణులు ఉన్నారు. వీరు గతంలో ఇండియన్ సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ)తోనూ కలిసి పనిచేశారు.
కీలకమైన ప్రాజెక్ట్ విషయంలో సహాయ సహకారాలు అందించారు. ఈ బృందమే తాజాగా పోలవరం ప్రాజెక్ట్ పనులను తనిఖీ చేసి.. ఆ పనులు సీడబ్ల్యూసీ సూచనలకు, కన్సల్టెంట్ సంస్థ ఏఎఫ్‌ఆర్‌వై ప్రతిపాదనలకు అనుగుణంగా లేవని నిర్ధారించింది. ప్రాజెక్ట్ పరిధిలో అనేక లోపాలను గుర్తించింది. ఇప్పటికే పూర్తయిన నిర్మాణాల నుంచి నీటి ఊట రావడం పెద్ద లోపమని పేర్కొంది.
అంతేకాదు.. వానకాలంలో గోదావరి వరదల ధాటికి తట్టుకు నేలా కొన్ని నిర్మాణాలు లేవని తేల్చిచెప్పింది. గట్టిగా వరదలు వస్తే పైపింగ్ వ్యవస్థ ధ్వంసమయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. నిర్మాణాల కింద ఉండే మట్టి కోతకు గురయ్యే ప్రమాదం ఉందని తేల్చిచెప్పింది. సరిగ్గా 2023లో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బరాజ్ కుంగుబాటుకు కూడా ఇదే ప్రధాన కారణమని ఉద్ఘాటించింది.
ఆ పనులనూ ఇదే కాంట్రాక్ట్ సంస్థ చేపట్టింది. ఇప్పటికైనా కాంట్రాక్ట్ సంస్థ, ఏపీ ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకోకపోతే ప్రాజెక్ట్ కూలిపోయే ప్రమాదం ఉందని కుండబద్దలు కొట్టింది. తక్ష ణం రిటైనింగ్ వాల్ వద్ద లీకేజీల నివారణ చర్యలు చేపట్టాలని, సీపేజ్ విశ్లేషించి డయా ఫ్రం వాల్ ఎత్తును తిరిగి లెక్కించాలని కీలక సూచనలు చేసింది. ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతానికి భూకంప ముప్పుకూడా పొంచి నేప థ్యంలో అసంపూర్ణమైన అంచనాలను నమ్మొద్దని, మళ్లీ సమగ్రమైన అంచనాలు తీయాలని ఆధారపడవద్దని కమిటీ స్పష్టం చేసింది.
మేల్కొనకపోతే పెను ముప్పు..
తాజాగా లోక్‌సభలో ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు జలశక్తి శాఖ సహాయ మంత్రి సమాధానం చెబుతూ.. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ స్పెసిఫైడ్ డ్యామ్స్ (ఎన్‌ఆర్‌ఎస్టీ) డేటా ప్రకారం ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్‌లోని లయర్ ఖజూరి డ్యాం, జార్ఖండ్‌లోని బొకారో బ్యారేజ్, తెలంగాణలోని మేడిగడ్డ బరాజ్ అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నాయని స్పష్టం చేశారు.
ఇప్పటికైనా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించి ప్రాజెక్ట్ పటిష్టతకు చర్యలు తీసుకోవాలి. ఒంటెద్దు పోకడలా కాంట్రాక్టు సంస్థ ఇష్టారీతిన పనులు చేపడితే మేడిగడ్డ బరాజ్ పరిస్థితే పోలవరం ప్రాజెక్ట్ కూ ఎదురుకావాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
డయాఫ్రం వాల్ పనులు మైనస్..
డయాఫ్రం వాల్ పనులు మొదటి నుంచీ ప్రాజెక్టుకు పెద్ద మైనస్ అని నిపుణుల బృందం స్పష్టం చేసింది. ప్రణాళికాపరమైన లోపాల వల్ల ఇప్పటికే ఆ వాల్ గోడ దెబ్బతిన్నది. వాటి మరమ్మతులకు అదనంగా రూ. 1,000 కోట్లకు పైగా ఖర్చవుతున్నది. ఇది ఇలా ఉండగా, మరోవైపు ప్రస్తుతం ఏపీలోని టీడీపీ ప్రభుత్వం, గత వైఎస్సార్ సీపీ మధ్య పోలవరం ప్రాజెక్ట్‌పై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయే తప్ప,
లోపభూయిష్టంగా ఉన్న ప్రాజెక్ట్ పనులను పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికైనా అక్కడి ప్రభుత్వం తన ధోరణి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్ట్ నాణ్యతపై రాజీలేని చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కాంట్రాక్ట్ సంస్థ పక్కాగా పనులు చేపట్టేలా నిబంధనలు కఠిన తరం చేయాల్సి ఉంటుంది.