26 July, 2026 | 12:03 PM

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

31-05-2024 12:24 AM

కారకులను శిక్షించాలని విద్యార్థి సంఘాల ఆందోళన

రంగారెడ్డి, మే30 (విజయక్రాంతి) : షాద్‌నగర్ నియోజకవర్గం ఫరుఖ్‌నగర్ మండ లంలోని కందివనం గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని మానస (21) తన ఇంట్లో ఆత్మహత్య చేసుకొన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లక్ష్మమ్మకు నలుగురు కూతుర్లు, ఒక కొడుకు. నలుగురు కూతుర్లకు పెళ్లిళ్లు కాగా చిన్న కూతురు మానస షాద్‌నగర్ పట్టణంలో ఒక కళాశాలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. బుధవారం లక్ష్మమ్మ తన దగ్గరి బంధువు మృతిచెందడంతో వారి గ్రామానికి వెళ్లింది.

ఇంట్లో ఏవరూ లేని సమయంలో మానస ఫ్యాన్‌కు ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన లక్ష్మమ్మ తన కూతురు విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుతూరు ఆత్మహత్య చేసుకోలేదని, గత కొంతకాలంగా తమ సమీప బందువు రాములు తన కూతురిని పెళ్లి పేరిటా వేధిస్తున్నట్లు తెలిపింది. రాములే తన కుతురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపించింది. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మానస మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

సీఐ ప్రతాప్ లింగం మాట్లాడుతూ పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తరువాత మానస హత్యా? ఆత్మహత్యా? అనే పూర్తి వివరాల ను వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పలువురు విద్యార్థి సంఘాల నాయకులు మానస ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని పట్టణంలో ఆందోళనకు దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పి మానస కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.