ప్రతిపక్షాల కుట్రతోనే మారేళ్లపాడు పనుల్లో జాప్యం
రైతులకు త్వరలోనే నీళ్లు అందిస్తాం: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఓరుగంటి రమేష్
అశ్వాపురం, ఆగస్టు 12 (విజయక్రాంతి): తుమ్మలచెరువు ఆయకట్టు రైతులకు త్వరితగతిన సాగునీరు అందించేందుకు ప్రభుత్వం పనులను వేగవంతం చేస్తున్నప్పటికీ, కొన్ని ప్రతిపక్ష పార్టీలు అడ్డంకులు సృష్టిస్తూ పనుల్లో జాప్యానికి కారణమవుతున్నాయని అశ్వాపురం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ ఆరోపించారు.
అశ్వాపురం మండల కేంద్రంలోని ఓరుగంటి వీరయ్య భవన్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు తుమ్మలచెరువు ఆయకట్టు రైతులకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పనులను అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాల ఎన్ని అడ్డంకులు, కుట్రలు చేసినా అనుకున్న ప్రకారమే ఆగస్టు 15న మోటార్ల డ్రై రన్ నిర్వహిస్తామని తెలిపారు.
రైతులకు త్వరలోనే నీటిని అందిస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తమతో కలిసి వచ్చి రైతులతో మాట్లాడి పనులకు సహకరించాలని రమేష్ కోరారు. ఒకరిద్దరు రైతులను అడ్డం పెట్టుకుని సుమారు 150 మీటర్ల మేర పనులను నిలిపివేసి అడ్డంకులు సృష్టించడం సరికాదని సూచించారు. ఈ సమావేశంలో ఉసా అనిల్, ఆవుల రవి, మట్టె భద్రారెడ్డి, గాదె వెంకటరెడ్డి, లంక మల్ల కొండలరావు, రావులపల్లి నరసింహారావు, గొల్లపల్లి నరేష్, జినుగు రాము తదితరులు పాల్గొన్నారు.






