వర్ణం రెస్టారెంట్‌లో ఫంగస్ పట్టిన కూరగాయలు
నోటీసులకు సిద్ధమైన సీఎంసీ
శేరిలింగంపల్లి,ఆగస్టు 12 (విజయక్రాంతి):సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు ఆహార పరిశుభ్రతపై కఠిన తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో హఫీజ్పేట్ జెన్పాక్ట్ లేన్లోని ‘వర్ణం’ ఆహార కేంద్రంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.తనిఖీలో వంటగది నిర్వహణ, ఆహార పదార్థాల నిల్వ, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత, అవసరమైన ధ్రువపత్రాలను సమగ్రంగా పరిశీలించారు. సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తున్నట్లు అధికారులు గుర్తించినా, వంటగది నిర్వహణలో అనేక తీవ్ర లోపాలు బయటపడ్డాయి.డ్రైన్లలో నీరు నిలిచిపోవడం, ఆహార వ్యర్థాలు పేరుకుపోవడం కనిపించాయి.
కాలీఫ్లవ్ప ఫంగస్, చెడిపోయిన క్యాబేజీ, బంగాళాదుంపలు నిల్వలో ఉన్నట్లు గుర్తించారు. ఆహార పదార్థాలను నేలపై ఉంచకుండా ఉపయోగించాల్సిన ప్యాలెట్లు అందుబాటులో లేకపోవడం, ఐరన్ కత్తులు వాడుతున్నట్లు కూడా తేలింది.ఫోస్కోస్ తనిఖీలో ఈ కేంద్రానికి 61 శాతం స్కోరు మాత్రమే వచ్చింది. దీంతో సీఎంసీ అధికారులు నోటీసు జారీ చేయాలని నిర్ణయించారు. ఆహార భద్రతపై ఎలాంటి రాజీ లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.






