ధాన్యం కొనుగోళ్లలో జాప్యం

25-04-2024 01:17:02 AM

యాదాద్రిభువనగిరి, ఏప్రిల్ 24 (విజయక్రాంతి) : జిల్లా వ్యాప్తంగా వరికోతలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే వరి కోతలు పూర్తి అయిన పంటను ఆయా గ్రామాల పరిధిలో ఉన్న కొనుగోలు కేంద్రాలకు తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 మండలాలు, 6 మున్సిపాలిటీల పరిధిలో 421 గ్రామాలు ఉన్నాయి. ధాన్యం కొనుగోలుకు సంబంధించి 323 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఐకెపీ ద్వారా 85, పీఏసీఎస్ ద్వారా 225, ఎఫ్‌పీవో ద్వారా 13 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. కొనుగోలు చేసిన ధాన్యా న్ని తరలించడానికి 250కి పైగా వాహనాలు సమకుర్చారు. మిల్లులలో సకాలంలో ధాన్యం ఆన్‌లోడ్ కాకపోవడంతో కొనుగోలు ప్రకియ జాప్యం జరుగుతోంది. మిల్లు లలో హమాలీల లేకపోవడంతోనే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలిచిపోతుందని సంబంధిత అధికారులు తెలిపారు. 

ధాన్యం దిగుబడి ఇలా..

యాదాద్రి జిల్లాలో యాసంగి సీజన్‌లో 2,93,000 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేయగా, దిగుబడి 525000 లక్షల మెట్రిక్ టన్నులు అంచనా వేయగా ఇందులో కొంతవరకు పంటనష్టం జరుగగా, ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు పోను సుమారు 3లక్షలకు పైగా మెట్రిక్ టన్నులు ధాన్యం వస్తాదని అంచనా వేశారు. 

1 న ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం

ఏప్రిల్ 1న కొనుగోలు ప్రారంభం కాగా ఇప్పటి వరకు 63,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఇందులో 57,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లుకు తరలించగా వాహనాల కోరతతో ఇంకా 6000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తరలించాల్సి ఉంది. 

కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కమిషనర్

ఆలేరులో రైతు సహకార ఉత్పతిదారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్ డీఎస్ చౌహన్ బుధవారం పరిశీలించారు. రైతులకు ఇబ్బందు లు కలుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అకాల వర్షాలపై జాగ్రత్త వహించాలని, టార్పాలిన్ కవర్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.