ఓటమి భయంతోనే దేవుళ్లపై రేవంత్ ప్రమాణాలు
l ముఖ్యమంత్రివి అబద్ధపు హామీలు
l కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా వృథా
l బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటైనా దక్కదు..
l బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ఓటమి భయంతోనే సీఎం రేవంత్‌రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుళ్లపై ప్రమాణాలు చేస్తున్నారని, అబద్ధపు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ విమర్శించారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఎన్నికల ప్రచారంలోకి రాముడిని లాగుతున్నదని సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆ వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. ఒక్క భారత్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం మోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్నదన్నారు. ఆయన ముందు సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎంత అని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేకతతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని గుర్తుచేశారు.
ఒకప్పుడు మజ్లిస్‌ను పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లౌకికవాదం గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లింలకు 4 శాతం మతపరమైన రిజర్వేషన్లు కల్పించి బీసీ రిజర్వేషన్లకు గండి కొట్టిందన్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) రాజ్యాంగ విరుద్ధ కార్యక్రమాలకు పాల్పడుతుంటే కాంగ్రెస్, బీఆర్‌ఎస్, కమ్యూనిస్టులు రోహింగ్యాలను సమర్థించారని గుర్తుచేశారు. సికింద్రాబాద్‌లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి నిజం చెప్పారని, కానీ ఈసారి సికింద్రాబాద్‌లో గెలిచేది బీజేపీ అభ్యర్థేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 17 సీట్లలో బీఆర్‌ఎస్‌కు ఒక్కసీటైనా దక్కదన్నారు. తెలంగాణ భవన్ ఎదుట ‘ఫర్ సేల్ బోర్డు’ పెట్టినా కొనే దిక్కుండదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బస్సుయాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు స్వాగతించరని స్పష్టం చేశారు.






