16 July, 2026 | 7:13 AM

ఢిల్లీ చలో మరోసారి వాయిదా

09-12-2024 01:54 AM
  1. శంభు సరిహద్దులో రైతులపై మళ్లీ టియర్ గ్యాస్
  2. ఎనిమిది మందికి అస్వస్థత.. వెనక్కి తగ్గిన రైతు సంఘాలు
  3. నేడు భవిష్యత్ ప్రణాళిక ప్రకటన

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు మరో 11 డిమాండ్ల సాధనకు ఆదివారం రైతు సంఘాలు చేపట్టిన ‘ఢిల్లీ చలో’ కార్యక్రమం నిరసనలతో హోరెత్తింది. ఉద్రిక్తతలకు కారణమైంది. పంజాబ్ హర్యానా సరిహద్దులో ఉద్రిక్తతలకు తావునిచ్చింది. భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో రైతులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో రైతు సంఘాలు మరోసారి నిరసనను వాయిదా వేశాయి.

12 డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా తదితర సంఘాల ఆధ్వర్యంలో పంజాబ్, హర్యానా నుంచి 101 మంది రైతులు ఆదివారం మధ్యాహ్నం శంభు సరిహద్దు చేరుకున్నారు. అక్కడి నుంచి పాదయాత్రగా ఢిల్లీకి బయల్దేరారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు సరిహద్దులో భారీ ఎత్తున మోహరించారు. పాదయాత్ర కొనసాగకుండా భద్రతా దళాలు ఫెన్సింగ్ వేశారు. 

తొలుత రైతులపై పూలు చల్లుతూ..

పాదయాత్రగా వస్తున్న రైతులపై తొలుత పూలు చల్లుతూ పాదయాత్రను విరమించుకోవాలని పిలుపునిచ్చారు. రైతులు పట్టించుకోకుండా ముందుకు కదులుతుండడంతో టియర్ గ్యాస్, వాటర్ జెట్స్‌ను ప్రయోగించారు. దీంతో సుమారు ఎనిమిది మంది రైతులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను తోటి రైతులు స్థానిక ఆసుపత్రులకు తరలించారు.

దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. రైతులు, భద్రత దళాలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో పాదయాత్రను రైతుసంఘాలు వాయిదా వేశాయి. సోమవారం తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. టియర్ గ్యాస్ ప్రయోగంపై పంజాబ్‌కు చెందిన రైతు సంఘం నేత సర్వాన్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ.. పాదయాత్రను భద్రతా బలగాలు అడ్డుకోవడం దారుణమన్నారు. 

భారత ప్రభుత్వం రైతుల న్యాయ సమ్మతమైన డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే ప్రధానమంత్రి మోదీ రైతు సమస్యలపై నోరువిప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు 101 మంది రైతులకు మాత్రమే పాదయాత్రగా ఢిల్లీకి వచ్చే అనుమతి ఉందని, అలా కాకుండా అంతకంటే ఎక్కువ మంది పాదయాత్రలో పాల్గొన్నారని, 101 మంది జాబితాలో లేని వారు కూడా యాత్రలో పాల్గొనడంతోనే టియర్ గ్యాస్ ప్రయోగించాల్సి వచ్చిందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.