16 July, 2026 | 7:48 AM

ఢిల్లీ X హైదరాబాద్

20-04-2024 12:50 AM

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: హైదరాబాద్‌తో మ్యాచ్ అంటేనే ప్రత్యర్థులు వణికిపోతున్నారు. ప్రత్యర్థి జట్లను బాదడమే లక్ష్యంగా పెట్టకున్న రైజర్స్ బ్యాటర్లు కసిగా ఆడుతుండడంతో ఎక్కడ బంతులు వేయాలో అర్థం గాక బౌలర్లు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ తమ సొంతగడ్డ వేదికగా హైదరాబాద్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా శనివారం ఇరుజట్లు తలపడనున్నాయి. తాజా సీజన్‌లో హైదరాబాద్ ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉండగా.. ఢిల్లీ ఏడు మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో ఆరో స్థానంలో ఉంది.

ఇరుజట్ల బలబలాలను పరిశీలిస్తే.. ఢిల్లీ కంటే హైదరాబాద్ ఫెవరెట్‌గా కనిపిస్తోంది. ఒకప్పుడు బలమైన బౌలింగ్ లైనప్ కలిగిన జట్టుగా పేరున్న హైదరాబాద్ తాజా సీజన్‌లో మాత్రం గేర్ మార్చింది. ట్రెవిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, మార్క్మ్,్ర అబ్దుల్ సమద్, ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డిలతో బ్యాటింగ్ లైనఫ్ దుర్భేద్యంగా కనిపిస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసిందంటే 200కు పైచిలుకు స్కోర్లను నమోదు చేసిగాని హైదరాబాద్ తన ఇన్నింగ్స్‌ను ముగించడం లేదు. ఇక బౌలింగ్‌లోనూ అంతే శక్తిమంతంగా కనిపిస్తోంది. కెప్టెన్ పాట్ కమిన్స్ తొమ్మిది వికెట్లతో హైదరాబాద్ తరపున లీడింగ్ వికెట్ టేకర్‌గా కొనసాగుతుండగా.. మయాంక్ మార్కండే తన స్పిన్ అస్త్రంతో వికెట్లు తీస్తున్నాడు. అయితే భువనేశ్వర్ మాత్రం ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడం ఇబ్బందికర అంశంగా మారింది.