16 July, 2026 | 8:03 AM

రాహుల్ రాక్స్

20-04-2024 12:50 AM

ఈ సీజన్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేక ఇబ్బంది పడుతున్న లక్నో సారథి కేఎల్ రాహుల్.. ఎట్టకేలకు జూలు విదిల్చాడు. చెన్నైతో పోరులో రాహుల్ సాధికారిక బ్యాటింగ్‌కు డికాక్ సహకారం తోడవడంతో లక్నో సీజన్‌లో నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. మొదట బౌలింగ్ యూనిట్ సమష్టిగా సత్తాచాటి చెన్నై బ్యాటర్ల జోరుకు కళ్లెం వేయగా.. ఆ తర్వాత ఓపెనర్లు దుమ్మురేపడంతో లక్నో గెలుపు సులువైంది. ఫలితంగా వరుస పరాజయాలకు చెక్ పెట్టిన లక్నో ఎట్టకేలకు విజయాల బాటపట్టింది. 

లక్నోకు నాలుగో విజయం  n  చెన్నైకి తప్పని ఓటమి

లక్నో: రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్లో ఓ సాధారణ మ్యాచ్ దర్శనమిచ్చింది. ఎలాంటి మలుపులు లేకుండా సాదాసీదాగా సాగిన పోరులో సత్తాచాటిన లక్నో సీజన్‌లో నాలుగో విజయం ఖాతాలో వేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో లక్నో సూపర్ జెయింట్స్ 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (40 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. అజింక్యా రహానే (36; 5 ఫోర్లు, ఒక సిక్సర్), మోయిన్ అలీ (30; 3 సిక్సర్లు) పర్వాలేదనిపించారు. ఎప్పట్లాగే మిస్టర్‌కూల్ మహేంద్రసింగ్ ధోనీ (9 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆఖర్లో మెరుపులు మెరిపించాడు.

19వ ఓవర్లో 4,6 కొట్టిన మహీ.. ఇన్నింగ్స్ ఆఖరి నాలుగు బంతులకు 6,4,2,4 బాదాడు. లక్నో బౌలర్లలో కృనాల్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 19 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (53 బంతుల్లో 82; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో కదంతొక్కగా.. క్వింటన్ డికాక్ (43 బంతుల్లో 54; 5 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో జోరు కొనసాగించాడు. జట్టు విజయానికి చేరువైన సమయంలో వీరిద్దరూ ఔటైనా.. పూరన్ (23 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) మిగిలిన పని పూర్తిచేశాడు. చెన్నై బౌలర్లలో ముస్తఫిజుర్, పతిరణ చెరో వికెట్  పడగొట్టారు. లీగ్‌లో భాగంగా శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. 

సంక్షిప్త స్కోర్లు

చెన్నై: 176/6 (జడేజా 57 నాటౌట్, రహానే 36; కృనాల్ 2/16), 

లక్నో: 19 ఓవర్లలో 180/2 (రాహుల్ 82, డికాక్ 54; పతిరణ 1/29).