30 June, 2026 | 12:53 AM

విస్తరించిన వర్షాలతో విత్తన షాపుల్లో పెరిగిన గిరాకీ

30-06-2026 12:12 AM

కేసముద్రం, జూన్ 29 (విజయక్రాంతి): విస్తరించిన వర్షాలతో.. రైతులు వానకాలం పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. ముందుగా వరి నారు పోయడానికి విత్తనాల కోసం విత్తనాల షాపుల బాట పట్టారు. ఏలినో కారణంగా ఆశించిన విధంగా వర్షాలు కురవక పోవచ్చని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, తక్కువ పంట కాలం, సన్న రకం వరి ధాన్యం సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. సోమవారం కేసముద్రం పట్టణంలోని వివిధ ఎరువులు, విత్తనాల షాపుల్లో రైతుల హడావుడి కనిపించింది. 

విత్తనాల షాపుల్లో ఏవో తనిఖీలు

కేసముద్రం పట్టణ పరిధిలోని పలు ఎరువులు, విత్తనాల విక్రయ షాపుల్లో మండల వ్యవసాయ అధికారి వెంకన్న సోమవారం తనిఖీలు నిర్వహించారు. రైతులకు విత్తనాలు విక్రయించే సమయంలో తప్పకుండా రసీదు ఇవ్వాలని, రైతులు కూడా విత్తనాలకు సంబంధించిన రసీదులు తీసుకుని పంటకాలం పూర్తి అయ్యేంతవరకు జాగ్రత్తపరచాలని కోరారు. ఎప్పటికప్పుడు వ్యాపారులు స్టాక్ వివరాలను ప్రదర్శించాలన్నారు.