30 June, 2026 | 2:12 AM

నల్లగొండ ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలి

30-06-2026 12:51 AM
  1. మహిళల హామీల గురించి మాట్లాడని రేవంత్
  2. ఖాళీ కుర్చీల ముందట ఆయన ఉపన్యాసం
  3. నల్లగొండకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు 
  4. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): నల్లగొండ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మహిళలకు గతంలో ఇచ్చిన హామీల గురించి మాట్లాడలేదని, ఖాళీ కుర్చీల ముందట ఆయన ఉపన్యాసం ఇచ్చి వెళ్లిపోయారని, నల్లగొండకు ఒక్క రూపాయి కూడా ప్రకటించలేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలని కోరారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో సోమవారం ఉమ్మడి నల్లగొండ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.

నల్లగొండలో సీఎం రేవంత్‌రెడ్డి ఖాళీ కుర్చీల ముందట వాంతి చేసుకుని పోయారని విమర్శించారు. మీటింగ్‌కు అధికారుల ప్రయాస పడటం తప్ప ఒరిగిందేమీ లేదని అన్నారు. కేసీఆర్ మీద పడి ఏడ్చుడు తప్ప ఏమీ చేయలేదన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నబిన్ కూడా కేసీఆర్‌నే టార్గెట్ చేశారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు రెండూ ఒకటేనని, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోరని అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీని ఏమీ అనరని పేర్కొన్నారు.

కిషన్‌రెడ్డిని మాత్రం ఏదో అన్నట్టు నటిస్తాడని ఎద్దేవా చేశారు. 50 కోట్లిచ్చి పీసీసీ పదవి తెచ్చుకుని, 50 వేల కోట్లు రేవంత్‌లాగా సంపాదించుకోవచ్చని తెలిస్తే తామూ పీసీసీ అధ్యక్ష పదవి తెచుకునేవాళ్లమని కొందరు కాంగ్రెస్ నేతలు వాపోతున్నారని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. మూడు నిమిషాల్లో నల్లగొండకు కేసీఆర్ చేసిన 300 పనులు చెప్పగల మని, 300 గంటలు టైమ్ ఇచ్చినా కాంగ్రెస్ చేసిందేమిటో చెప్పలేరని విమర్శించారు. నాగార్జున సాగర్‌లో నీళ్లున్నా సరిగా రైతులకు ఇవ్వని పరిస్థితి నెలకొన్నదన్నారు.

చంద్రబాబుకు నీళ్లు దోచిపెట్టడం తప్పా రేవంత్‌కు ఏమీ తెలియదంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు సమయం కోసం ఎదురుచూస్తున్నారని, సమయం వచ్చినప్పుడు రేవంత్‌ను తొక్కడం ఖాయమని పేర్కొన్నారు. అసెంబ్లీ నిర్వహించ కుండా సీఎం తప్పించుకుంటున్నారని, అసెంబ్లీలో చర్చకు సిద్ధమైతే ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు తెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ కేసీఆర్‌ణు లక్ష్యంగా చేసుకోవడం బీఆర్‌ఎస్ బలాన్ని సూచిస్తోందని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, భూపాల్‌రెడ్డి, గొంగిడి సునీత, కే ప్రభాకర్‌రెడ్డి, గాదరి కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.