15 March, 2026 | 8:48 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

గిరాకీ లేక ఆటోవాలా విలవిల

30-10-2025 12:28 AM
  1. మహిళలకు ఉచిత ప్రయాణం ఎఫెక్ట్
  2. కిస్తీలు కట్టలేక ఆగమాగం
  3. కుటుంబ పోషణ భారం
  4. ఆటోలు అమ్ముకుంటున్న డ్రైవర్లు

బాన్సువాడ, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడంతో మహిళలు బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. దీంతో ఆటోవాలాలు అవస్థలు పడుతున్నారు. మహిళా ప్రయాణికులు లేక ఆటోలు వేలవేల బోతున్నాయి. కేవలం పురుషులు మాత్రమే ఆటోలలో ప్రయాణం చేస్తున్నాడంతో ఆటోవాలాలకు భారీగా గిరాకీ తగ్గింది. గతంలో ఎక్కడ చూసినా ఆటోలల్లో మహిళలు కనిపించేవారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో మహిళలు ప్రయాణం చేసేందుకు ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల లో ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆటోవాలా ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఫైనాన్సులలో తెచ్చుకున్న వారు ఫైనాన్స్ కిస్తీలు చెల్లించక ఆటోలను అమ్ముకుంటున్నారు. మరికొందరు కుటుంబ పోషణ భారంగా మారడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ప్రభుత్వం ఆటోవాలాలకు నెలసరిగా పింఛన్ సౌకర్యం కల్పిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన అమలు చేయడం లేదు. ఉపాధి దెబ్బ తినడంతో ఆటోవాలాలు అవస్థలు పడుతున్నారు. గులాబీ పార్టీ ప్రభుత్వ హాయంలో రుయ్యు.. రుయ్యున తిరిగే ఆటోల స్పీడుకు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో బ్రేక్ పడింది. దినమంతా కిటకిటలాడే ఆటో స్టాండ్ లలో ప్రయాణికుల జాడే కనిపించకుండా పోయింది.

ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం పేరిట మహాలక్ష్మి పథకాన్ని అమలులోకి తేవడంతో ఆటోవాలాల ఆదాయానికి గండి పడింది. పొద్దంతా అడ్డాలో కూసున్న.. సంపాదన మాత్రం సున్నా గా మారింది. తెలంగాణలో ఆటో రిక్షా కార్మికుల పరిస్థితి ఇలా ఉంటే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం అక్కడి ప్రభుత్వం దీపావళి కానుకగా ప్రతి ఆటో రిక్షా కార్మికుడికి 15వేల రూపాయల చొప్పున వారి వారి ఖాతాలో జమ చేస్తున్నట్లు ప్రకటించడం పై ఇక్కడి ఆటో రిక్షా  సంఘాల్లో ఆందోళన మొదలైంది.

తమ కూడా ఆంధ్రాలో ఇస్తున్నట్లుగా తెలంగాణ ఆటో రిక్షా కార్మికులకు దీపావళి కానుక అందించాలంటూ వారి నుండి డిమాండ్ తెరపైకి వస్తుంది. కాగా, గతంలో ఆటోలు మహిళలతోనే నిండుగా కనిపించేవి. ప్రస్తుతం మహిళా ప్రయాణికులు అందరూ ఆధార్ కార్డుతో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుండడం వల్ల ఆటోలలో మహిళల సందడి లేకుండా ఉంది. నిజానికి పల్లె నుండి పట్టణానికి రావాలన్న, పట్టణవాసులు మార్కెట్లో ఏదైనా ఖరీదు చేయాలన్న ఆటోలను మహిళల ఆశ్రయించే పరిస్థితి ఉండేది.

దీంతో ఆటోవాలాలు రోజుకు 1000 నుండి 1500 రూపాయల వరకు సంపాదించుకునేవారు. ఆర్టీసీ బస్టాండ్ ల ముందు ఆటో అడ్డాలు ఉండటం వల్ల ప్రయాణికులు దూర ప్రాంతాల నుండి వచ్చిన, సమీపంలో ఉన్న పల్లెలకు వెళ్లాలన్న ఆటోలోనే ప్రయాణం చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సులను మాత్రమే ఆశ్రయిస్తున్నారు. చివరకు పట్టణంలోని మార్కెట్ కు వెళ్లాలన్న బస్సులోనే ప్రయాణం సాగిస్తున్నారు.

దీనివల్ల ఆటోవాలాలకు గిరాకీ లేక ఆదాయం పూర్తిగా సన్నగిల్లింది. చదువుకున్న, చదువుకోకపోయినా డ్రైవింగ్ శిక్షణ పొంది ఆటోలను కొనుగోలు చేసి జీవనం సాగించేవారు. నెలసరికిస్తులతో ఆటోలను కొనుగోలు చేసి నడుపుకుంటూ క్రమంగా బాకీ ని తీర్చుకుని అవకాశం వారికి ఉండేది. ఆటో నడవకపోగా, ఆశించినంతగా ఆదాయం సమకూరకపోవడంతో వాహన బాకీ ని తీర్చలేక ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది.

నెలసరి కిస్తూ కట్టలేదని ఫైనాన్స్ యజమానులు ఆటోలను లాకెళ్లే పరిస్థితి దాపురించింది. ఇటు ఆటో లేక, చేతినిండా పని లేక ఇంతకాలం హాయిగా బతికిన ఆటోవాలాల జీవనం దుర్భరంగా మారింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో వేలకొలది ఆటోలు నడుస్తున్నాయి. చాలా కుటుంబాలు ఆటో డ్రైవింగ్ పై ఆధారపడి ఉన్నాయి. ఉచిత ప్రయాణం పేరిట మహిళా ప్రయాణికులకు ప్రభుత్వం సానుకూల ధోరణితో వివరించినప్పటికీ, చర్య ప్రభావం ఆటోవాలాల బ్రతుకులపై పడింది.

పొద్దంతా అడ్డాలో కూర్చుండి నిరీక్షించిన కేవలం 200 నుండి 500 వరకు కూడా సంపాదించలేకపోతున్నామని ఆటోవాలాలు ఆందోళన చెందుతున్నారు. పాలకులు ఆటోవాలాల విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉందంటూ మేధావులు పేర్కొంటున్నారు. మహిళలకు లాభం చేసి.. ఆటో రిక్షా వాళ్లకు నష్టం చేయడం ఎంత మటుకు సమంజసం అన్న వాదన సైతం వినిపిస్తోంది. ఆటో రిక్షా వారి జీవనోపాధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారికి కూడా తగు న్యాయం చేస్తే బాగుంటుందన్న డిమాండ్ తెరపైకి వస్తుంది.

అప్పు కట్టలేక ఆటో అమ్ముకున్న

ఆటో రిక్షాకు గిరాకీ లేక, ఆశించిన విధంగా ఆదాయం రాక అప్పు కట్టేందుకు ఆటో అమ్ముకునే పరిస్థితి దాపురించిందని బాన్సువాడ ఆటో డ్రైవర్ మౌలా ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో అమ్ముకొని జీవనోపాధి కోసం వెతికి పరిస్థితి ఏర్పడిందని వాపోయాడు. ఉచిత ప్రయాణం అమల్లోకి రాకముందు రోజువారీగా 1000 నుండి 1500 రూపాయలు ఆటో నడుపుకుంటూ సంపాదించే వాడినని, ప్రస్తుతం ఆటో నడవకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆందోళన చెందాడు. పాలకులు ఆటో రిక్షా వారి బతుకులపై కూడా ఆలోచించి వారి మేలు కోసం తక్షణ చర్యలు చేపట్టాలని మౌలా డిమాండ్ చేశారు.  తనే కాకుండా అడ్డాలో ఉన్న చాలామంది ఆటో డ్రైవర్ల పరిస్థితి కూడా దయనీయంగా ఉందన్నారు. ప్రతి డ్రైవర్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ కాలం వెళ్ళదీస్తున్నారని పేర్కొన్నారు.

 మౌలా, ఆటోడ్రైవర్, బాన్సువాడ

ఆడోళ్లకు లాభం, మగవారికి నష్టమా...

ప్రభుత్వం ఉచిత ప్రయాణం పేరిట పథకాన్ని అమల్లోకి తీసుకు రావడంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని, మహిళలకు లాభం చేకూర్చి పాలకులు ఆటో డ్రైవర్ల బతుకులను దయనీయంగా తయారు చేశారని బాన్సువాడ ఆటో డ్రైవర్ దత్తు ఆవేదన వ్యక్తం చేశారు. రోజంతా కష్టపడ్డ డీజిల్ ఖర్చు ఫోను 200 కు పైన మిగలడం లేదని వాపోయాడు. 200 రూపాయలతో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని దిగులు వ్యక్తం చేశారు.

ఆటో డ్రైవర్లకు కూడా ప్రభుత్వం ప్రతినెల పెన్షన్ రూపంలో అందించినట్లయితే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేశాడు. ఏదేమైపోయినప్పటికీ మహాలక్ష్మి పథకం ఆటో డ్రైవర్ల కలలను కల్లలు చేసింది. పిల్లాపాపలతో  హాయిగా సాగిపోతున్న వారి కుటుంబాలను ఆర్థికంగా చిన్న భిన్నం చేసిందని చెప్పవచ్చు.

పిల్లలను చదువుపించుకోలేక, వారి బాగోగులు చూడలేక ఆటో డ్రైవర్లు అపసోపాలు పడే పరిస్థితి నెలకొంది. ఆటో రిక్షా అనే సర్వస్వం అని నమ్మిన వారికి పాలకులు తీసుకున్న నిర్ణయం ఆటో వా లాల ఆదాయానికి భారీగా గండి కొట్టిందని చెప్పవచ్చు. ఆటో రిక్షా కార్మికుల విషయంలో ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న భావన మేధావుల్లో వ్యక్తం అవుతుంది.

 దత్తు, ఆటో డ్రైవర్, బాన్సువాడ