8 August, 2026 | 1:07 AM

అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి

08-08-2026 12:15 AM

మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

గువ్వల అరెస్టును ఖండిస్తూ కల్వకుర్తిలో బీజేపీ నిరసన

ఊర్కొండపేట/కల్వకుర్తి, ఆగస్టు 7 (విజయక్రాంతి): అచ్చంపేట నియోజకవర్గంలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. లింగాల మండలంలో పండుగ సాయన్న విగ్రహం తొలగింపును నిరసిస్తున్న ముదిరాజులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఊర్కొండపేట పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో తెలిపారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే వారిని అణచివేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు.

మరోవైపు, గువ్వల బాలరాజు అరెస్టును ఖండిస్తూ కల్వకుర్తి పాలమూరు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. పండుగ సాయన్న విగ్రహం తొలగింపును వ్యతిరేకిస్తూ దీక్ష చేస్తున్న వారిని పరామర్శించేందుకు వెళ్తున్న నాయకుడిని అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు గన్నోజు బాబీదేవ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మొగిలి దుర్గాప్రసాద్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ధన్నోజు నరేష్ చారి తదితరులు పాల్గొన్నారు.