అక్రమ నిర్మాణాల కూల్చివేత
అబ్దుల్లాపూర్‌మెట్/ మణికొండ, మే 25 : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పరిధిలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలను నేలమట్టం చేశారు. బలిజగూడ గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 169, 170, 183, 149లలో, పెద్ద అంబర్‌పేట రెవెన్యూ పరిధిలోని 272,273 సర్వే నెంబర్‌లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. పసుమాముల గ్రామ రెవెన్యూ పరిధిలో 454 సర్వే నెంబర్‌లో రోడ్డుకు అడ్డంగా తొవ్విన పునాది నిర్మాణాన్ని పూడ్చివేశారు.
ఈ సందర్భంగా కమీషనర్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి అక్రమ నిర్మాణాలను తమ దృష్టికి తేవాలని ప్రజలను కోరారు. అయితే, ఈ కూల్చివేతలు సక్రమంగా జరగలేదని కొందరిపై చర్యలు తీసుకొని, మరికొందరిని వదిలేస్తున్నారని అధికారులపై విమర్శలు వినిపిస్తున్నాయి. బడాబాబులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని, దాదాపుగా 30 మందికి ఫైనల్ నోటీలు ఇచ్చి చిన్న చిన్న నిర్మాణాలనే కూల్చివేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బడాబాబులకు నోటిసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శిస్తున్నారు. నిష్పక్షపాతంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, ప్రభుత్వ భూమి కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
మణికొండ పుప్పాలగూడలోనూ..
నిబంధనలకు విరుద్ధంగా చేపట్టే అక్రమ నిర్మాణాలను సహించేది లేదని మణికొండ మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ అధికారి సంతోష్‌సింగ్ అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని పంచవటి కాలనీ, పుప్పాలగూడలో అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినా కూల్చివేస్తామని హెచ్చరించారు. ఈ కూల్చివేతల్లో పోలీసు సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.






