19 August, 2026 | 8:19 PM

విద్యార్థుల అభ్యసన సామర్థ్యమే తొలిమెట్టు లక్ష్యం

19-08-2026 07:44 PM

- డీఈఓ మాధవి

బేల,(విజయక్రాంతి): విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందించి, ప్రతి విద్యార్థి చదువులో మెరుగైన ప్రగతి సాధించేలా విద్యాబోధన సాగాలని జిల్లా విద్యాధికారి డి మాధవి అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సిర్సన్న ఉన్నత పాఠశాల, బేల ప్రాథమిక, మశాలా బి ప్రాథమికోన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో అమలవుతున్న తొలిమెట్టు (FLN – ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) కార్యక్రమం తీరును డీఈఓ పరిశీలించారు. విద్యార్థుల చదవడం, రాయడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలను స్వయంగా పరిశీలిస్తూ వారి అభ్యసన స్థాయిపై ఉపాధ్యాయులతో వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి కనీస అభ్యసన సామర్థ్య స్థాయిని చేరుకునేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధనా పద్ధతులను అవలంబించాలని, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి అదనపు సహాయం అందించాలని తెలిపారు. తొలిమెట్టు కార్యక్రమాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేసే విధంగా సమర్థవంతంగా అమలు చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. తరగతి గదిలో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంచుతూ, వారికి అర్థమయ్యే విధంగా బోధన సాగించాలని అన్నారు. ఆయా పాఠశాలలో బడి తోట, మధ్యాహ్న భోజన తీరును పరిశీలించారు.