పేదల ఇళ్లు.. రైతుల సాగునీరు గాలికేనా..?
- ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో కోదాడ నియోజకవర్గానికి అన్యాయం.. అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలి
- రూ.5 వేల కోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏమైంది?.. పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలి.
- సమీక్షలు, ప్రకటనలతో కాలయాపన వద్దు.. క్షేత్రస్థాయిలో పనులు చేపట్టాలి.
- హామీలు మాటల్లో కాదు.. చేతల్లో చూపాలి.. ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి చూపాలి
- సంక్షేమ పథకాల అమలులో జాప్యం.. ఎమ్మెల్యే, మంత్రిపై మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఫైర్
మోతె,(విజయక్రాంతి): కోదాడ నియోజకవర్గంలో సంక్షేమ పథకాల అమలులో తీవ్ర జాప్యం జరుగుతోందని, పేదలు, రైతుల సమస్యలను స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పట్టించుకోవడం లేదని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. బుధవారం మోతె మండల పరిధిలోని మామిళ్లగూడెం సుమంగళి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా కేవలం 500 నుంచి 600 ఇళ్లకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం దారుణమన్నారు. సొంత ఇళ్లు లేక పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, గ్రామాల వారీగా అర్హులను గుర్తించి పారదర్శకంగా ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ జోక్యానికి తావులేకుండా అర్హతే ప్రామాణికంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలన్నారు.
రూ.5 వేల కోట్ల లిఫ్ట్ ఎక్కడ.?
మోతె మండలానికి రూ.5 వేల కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మంజూరు చేశామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారని, అయితే పనులను వేగవంతం చేయడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని బొల్లం మండిపడ్డారు. ప్రాజెక్టు పూర్తయితే మోతెతో పాటు పరిసర ప్రాంతాల రైతులకు సాగునీటి సమస్య కొంతవరకు పరిష్కారమవుతుందనే ఆశతో రైతులు ఎదురుచూస్తున్నారని తెలిపారు.
ప్రచారానికే పరిమితం కాకుండా పనులు ఎప్పుడు ప్రారంభిస్తారు? ఎన్ని దశల్లో పూర్తి చేస్తారు? ఎంత మేర నిధులు విడుదల చేస్తారు? అనే అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమీక్షలు, ప్రకటనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించి పురోగతి చూపించాలని అన్నారు.
సమస్యలపై క్షేత్రస్థాయిలో దృష్టి పెట్టాలి
గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను గుర్తించి పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్, పాఠశాలలు, వైద్య సదుపాయాలు వంటి మౌలిక వసతులను మెరుగుపరచాలని సూచించారు. రైతులకు సాగునీరు, పేదలకు ఇళ్లు అందించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు.ప్రజలకు ఇచ్చిన హామీలను మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.
ఆర్భాటం కంటే ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ముఖ్యమని పేర్కొన్నారు. పేదలకు ఇళ్లు, రైతులకు సాగునీరు అందించడంలో విఫలమైతే రానున్న కాలంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. అనంతరం ఇటీవల హత్యకు గురైన హలవత్ నాగు,బూబల కుటుంబాన్ని పరామర్శించి ప్రగడ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆరే లింగారెడ్డి, మాజీ సర్పంచ్ వీరస్వామి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.






