28 July, 2026 | 12:56 AM

డ్యూటీకి వెళ్లి తిరిగిరాని యువకుడు పీఎస్‌లో ఫిర్యాదు చేసిన తండ్రి

28-07-2026 12:00 AM

జవహర్‌నగర్, జులై 27 (విజయక్రాంతి): ఇంట్లో డ్యూటీకి వెళుతున్నాను అని చెప్పిన యువకుడు అదృశ్యమైన సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్‌ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం... మల్కాజిగిరి కి చెందిన ముఖిత్ (20) గత మూడు సంవత్సరాలుగా దమ్మాయిగూడ లోని 3d వీల్స్ షాపులో పనిచేస్తున్నాడు. ముఖిత్ ఈనెల 24వ తేదీన తన సొంత ఇల్లు అయిన మల్కాజ్గిరి పరిధిలోని ఆనంద నగర్ కు వెళ్లి మరల తిరిగి ఈనెల 25వ తేదీన ఉదయం 9 గంటలకు దమ్మాయిగూడ లోని షాపుకు వెళ్తున్నానని చెప్పి దమ్మాయిగూడ కు వచ్చాడు.

అయితే అదే రోజున ఉదయం 11 గంటలకు 3d వీల్స్ షాప్ ఓనర్ అమరేందర్ రెడ్డి ముకిత్ తండ్రి జిలానికి ఫోన్ చేసి నీ కుమారుని స్కూటీ షాపు దగ్గర ఉందని డ్యూటీకి రాలేదని ఫోన్ ద్వారా తెలియజేశాడు. ఈ మేరకు వెంటనే జిలాని దమ్మాయిగూడకు వచ్చి తన కొడుకు గురించి చుట్టుపక్కల వెతికినా తెలిసిన వారి వద్ద వెతికినా, ముఖిత్ ఆచూకీ లభించలేదు. ఈ మేరకు తండ్రి జిలాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.