25-06-2025 06:28:32 PM
హైదరాబాద్: కుటీర పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉపాధి, ఆదాయం సృష్టిస్తున్నాయని, అలాంటి పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పేర్కొన్నారు. బీసీ సంక్షేమ శాఖ(BC Welfare Department) ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై ప్రారంభమైన బీసీ చేతివృత్తి కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శన(BC Handicraft Products Stalls)ను మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తో కలిసి సందర్శించారు. చేతివృత్తుల ప్రోత్సాహంతో ఆరోగ్య తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
జూన్ 29 వరకు జరిగే ఈ ఎగ్జిబిషన్‌లో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన కళాకారుల ఉత్పత్తులు ప్రదర్శించబడుతాయని, బీసీ కార్పొరేషన్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తోందని డిప్యూటి సీఎం తెలిపారు. మట్టి పాత్రలు, వెదురు వస్తువులు, చేనేత కాటన్ వస్త్రాలు, నీరా ఉత్పత్తులు, చేపల వంటకాలు ఇలా పలు రకాల స్టాల్స్ ను డిప్యూటీ సీఎంతో పాటు పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఆసక్తిగా పరిశీలించారు.