24 August, 2026 | 8:57 PM

ఇంద్రవెల్లి అమరవీరుల స్ఫూర్తితో ఉపసర్పంచుల హక్కుల సాధనకై పోరాటం

24-08-2026 07:51 PM

ఇంద్రవెల్లి,(విజయక్రాంతి): ఇంద్రవెల్లి అమరవీరుల స్ఫూర్తితో ఉపసర్పంచుల హక్కుల సాధనకై ఐక్యంగా పోరాటం చేస్తామని ఉపసర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ అన్నారు. ఉమ్మడి జిల్లాల పర్యటనలో భాగంగా సోమవారం ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చేరుకున్న ఆయన ముందుగా అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కార్తీక్ మాట్లాడారు.

గ్రామపంచాయతీల అభివృద్ధి, పాలనలో ఉపసర్పంచులు కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ, వారికి చట్టబద్ధంగా దక్కాల్సిన హక్కులు, అధికారాలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని అన్నారు. ఉపసర్పంచులకు ఉన్న హక్కులు, అధికారాలను పరిరక్షించడంతో పాటు గ్రామపంచాయతీ పాలనలో వారికి సముచిత ప్రాధాన్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఉపసర్పంచుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని కార్తీక్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఉపసర్పంచులను ఐక్యం చేసి హక్కుల సాధన కోసం కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. గ్రామాల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సర్పంచులతో పాటు ఉపసర్పంచులకు కూడా సముచిత అధికారాలు, బాధ్యతలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.