calender_icon.png 17 February, 2026 | 6:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డిప్యూటీ సీఎం భట్టి ప్రత్యేక పూజలు

16-02-2026 12:00:00 AM

ఎర్రుపాలెం, ఫిబ్రవరి 15 ( విజయ క్రాంతి): రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కాంక్షిస్తూ.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తన సతీమణి నందినితో కలిసి మధిరలోని గంగా పార్వతీ సమేత మృత్యుంజయ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ పర్యటనలో ప్రధాన ఘట్టంగా, స్వామివారి గర్భాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,

అలాగే రాష్ట్ర మంత్రివర్గంలోని కేబినెట్ మంత్రులందరి పేరిట వారి గోత్రనామాలతో భట్టి విక్రమార్క దంపతులు ప్రత్యేక అర్చన చేయించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు విజయవంతం కావాలని, పాలకవర్గంపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని వారు ఈ సందర్భంగా మొక్కులు చెల్లించుకున్నారు.

పూర్ణకుంభంతో ఘన స్వాగతం

వైరా నది తీరాన కొలువై ఉన్న మృత్యుంజయ స్వామి ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి దంపతులకు ఆలయ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఆలయ వేద పండితులు పూర్ణకుంభంతో ఆశీర్వచనాలు పలికి గర్భాలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం దంపతులు స్వామివారికి రుద్రాభిషేకం, పూజలు నిర్వహించారు.

వేద ఆశీర్వచనం.. తీర్థ ప్రసాదాల వితరణ

పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ మండపంలో అర్చకులు డిప్యూటీ సీఎం దంపతులకు వేద ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మహాశివరాత్రి పురస్కరించుకొని మధిరలో భక్తులకు కల్పించిన సౌకర్యాలను కూడా ఈ సందర్భంగా ఆయన పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, పెద్ద ఎత్తున భక్తులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

నియోజకవర్గ వ్యాప్తంగా భక్తులు ఆయా గ్రామాలలోని శివాలయాలలో తెల్లవారుజాము నుంచే శివుడికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం లో భక్తులు శ్రీ బాల త్రిపుర సుందరి సమేత చంద్రమౌలేశ్వర స్వామి వారిని దర్శించి తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు నూరి శ్రీ గోపాల కృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో శివాలయం చైర్మన్ మగినం జయశ్రీ, భక్తులు పాల్గొన్నారు.