4 April, 2026 | 9:18 AM

మల్లికార్జున ఖర్గే సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన డిప్యూటీ సీఎం భట్టి

02-07-2025 07:48 PM

హైదరాబాద్: నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఈ నెల 4వ తేదీన జరగనున్న ఎఐసీసీ (All India Congress Committee) అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామ శాఖ, మండల శాఖ, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు సమన్వయంతో కృషి చేసి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభలో ఎఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గ్రామస్థాయి నాయకులతో నేరుగా సమావేశం కావడం దేశంలోనే మొదటిసారి జరుగుతున్న చారిత్రాత్మక సంఘటన అని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం గర్వకారణంగా ఉందని, ఈ తరహా కార్యక్రమం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల్లోనూ జరుగనుందన్నారు. ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ ఉద్యమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించే ఈ సభకు సుమారు 15,000 మంది గ్రామస్థాయి కాంగ్రెస్ నాయకులు హాజరవుతారు.

ఈ సమావేశంలో ఖర్గే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, తెలంగాణలో గత 18 నెలల పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ చారిత్రాత్మక సమావేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసినందుకు ఎఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ఖర్గే సందేశాన్ని ప్రజలకు చేరవేసేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభ ఏర్పాట్లను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు  రోహిన్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం పర్యవేక్షించారు.