19 June, 2026 | 1:33 AM

నాయకత్వ స్థానంలో హైదరాబాద్

19-06-2026 12:00 AM

డాక్టర్ ఎం.వామన్‌రావు :

* హైదరాబాద్ నగరం ఏకకాలంలో రెండుసార్లు తన ఆర్థిక స్వరూపాన్ని మార్చుకుంది. అయితే, ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వస్తున్న సరికొత్త ట్రాన్స్‌పర్మేషన్‌ను అనుసరిస్తూనే, హైదరాబాద్ వాటికి నాయకత్వం కూడా వహించడం విశేషం. మొదట సాధారణ ఔషధాలు, టీకాలు, భారీస్థాయి ఔషధ ఉత్పత్తుల అభివృద్ధితో భారత్‌ను ప్రపంచ ఔషధ కేంద్రంగా నిలబెట్టడంలో ఈ నగరం కీలకపాత్ర పోషించింది.

ఆ తర్వాత హైటెక్ సిటీ, సైబరాబాద్ అభివృద్ధితో ప్రపంచ స్థాయి టెక్ హబ్‌గా ఎదిగింది. ఇప్పుడు మూడో ట్రాన్స్‌పర్మేషన్‌కు సిద్ధమవుతున్నది. లైఫ్ రంగాన్ని అత్యాధునిక సాంకేతికతతో అనుసంధానించి, ఏఐ కృత్రిమమేధ ఆధారిత ఆరోగ్యమౌలిక వసతుల కల్పన దిశగా హైదరాబాద్ కీలక అడుగులు వేసే వేస్తున్నది.

* హైదరాబాద్ తొలి అభివృద్ధి దశ ప్రపంచానికి అందుబాటు ధరల్లో ఔషధాలను అందించింది. రెండో దశ ప్రపంచ స్థాయి సాంకేతిక సామర్థ్యాన్ని నిర్మించింది. ఇక మూడో దశకు మాత్రం భారత్‌కే కాకుండా, ప్రపంచానికి కూడా మరింత ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమైన మౌలిక వ్యవస్థను అందించే సామర్థ్యం ఉంది. 

వైద్యరంగంలో పరిశోధనలు, పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులు సహా వివిధ రంగాల్లో అనేకదేశాల్లో పనిచేసిన అనుభవంతో హైదరాబాద్ అభివృద్ధిని నేను ప్రత్యక్షంగా గమనించాను. ఆరోగ్య సంరక్షణ, ఆరో గ్య మౌలిక వసతుల రంగాల్లో నాకు ఉన్న రెండు దశాబ్దాల అనుభవం ఈ నగర సామర్థ్యంపై  స్పష్టమైన అవ గాహనను కల్పించింది. ఇప్పుడు మూడో దశలో జరుగనున్న అభివృద్ధికి అవసరమైన అంశాలు హైదరాబాద్‌లో ఉండటమే కాదు, అవన్నీ ఒకే దగ్గర కేంద్రీకృతమై ఉం డటం ఈ నగర ప్రత్యేకతేనని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

సామర్థ్యం.. ప్రపంచ విశ్వాసం: హైదరాబాద్ ఆధునిక పారిశ్రామిక పునాది నియంత్రిత శాస్త్రీయ పరిశోధ నలు, ఉత్పత్తి సామర్థ్యంపై నిర్మితమైంది. తెలంగాణ లెఫ్ సైన్సెస్ సెక్టార్ దేశంలోని ఔషధ ఉత్పత్తిలో దాదాపు 40 శాతం వాటాను కలిగి ఉంది. అంతేకాదు, ప్రపంచ టీకాల సరఫరాలో సుమారు మూడో వంతు ఇక్కడి నుంచే అందుతున్నది. రెండు వేలకుపైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు, అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఎఫ్‌డీఏ ఆమోదించిన 269కి పైగా తయారీ కేంద్రాలు, ఔషధాలు, జీవ సాంకేతికత, వైద్య పరికరాలు, వైద్య పరిశోధనల రంగాల్లో ఆసియాలోని కీలక క్లస్టర్లలో ఒకటైన జీనోమ్ వ్యాలీకి హైదరాబాద్ నిలయం.

అయితే ఈ గణాంకాల కంటే ముఖ్యమైనది నియంత్రణ ప్రమాణాలు, శాస్త్రీయ క్రమశిక్షణ, ఎవిడెన్స్ బేస్డ్ ప్రొడక్షన్‌లతో కూడిన ఇక్కడి సంస్కృతి. భవిష్యత్తులో ఏఐ ఆధారిత ఆరోగ్య వేదికలకు బయోమార్కర్ సైన్స్, నిర్ధారణ పరీక్షలు, వైద్య పరిశోధనలు, చికిత్సా ఆవిష్కరణలు, అత్యున్నత ప్రమాణాల తయారీ సామర్థ్యాలు అవసరమవుతాయి. అయితే, ఈ వసతులన్ని ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్నాయి. నియంత్రిత జీవశాస్త్ర రంగం లో ఇంత సామర్థ్యమున్న నగరాలు చాలా అరుదు.

సాంకేతికత, నైపుణ్యం, డిజిటల్ విస్తరణ: రెండో దశ సాంకేతిక రంగంలో వచ్చింది. హైటెక్ సిటీ, సైబరాబాద్ లాంటివి ఇంజినీరింగ్ సెంటర్స్, ఎనలిటిక్స్ ఆపరేషన్స్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల స్థాపనకు అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించాయి. తత్ఫలితంగా సాంకేతిక నైపుణ్యం పరంగా హైద రాబాద్ ఇప్పుడు బెంగళూరు, పుణే వంటి నగరాలకు పోటీ ఇస్తున్నది.

ఈ సామర్థ్యాల ప్రాముఖ్యత భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశ ఉంది. క్లౌడ్ ఆర్కిటెక్చర్, లార్జ్ స్కేల్ డేటా ఇంజినీరింగ్, ఏఐ మోడల్ డెవలప్‌మెంట్, వర్క్‌ఫ్లో ఆటోమేషన్ వంటి అంశాలే పెద్ద ఎత్తున ఏఐ ఆధారిత ఆరోగ్య సేవలను అందించడానికి అవసరమైన సాధనాలు. లైఫ్ సైన్సెస్ రంగంలో లోతైన నైపుణ్యాన్ని, అంతర్జాతీయ స్థా యి సాంకేతిక సామర్థ్యాన్ని ఒకే ప్రాంతంలో కలిగి ఉన్న ప్రదేశాలు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి అరుదైన నగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి.

ప్రపంచవ్యాప్తంగా జనాభా వేగంగా వృద్ధాప్య దశలోకి ప్రవేశిస్తున్నది. ఈ తరుణంలో వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స అందించే ప్రస్తుత ఆరోగ్య వ్యవస్థలు ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాయి. మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, జీవక్రియ లోపాలు, జ్ఞాపకశక్తి క్షీణత వంటి దీర్ఘకాలిక సమస్యలు క్రమంగా పెరుగుతున్నాయి.

సేవలకు అనుగుణంగా చెల్లింపులు చేసే పాశ్చాత్య ఆరోగ్య నమూనా నివారణ, దీర్ఘకాలిక ఆరోగ్య నిర్వహణ వైపు మళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. అదే సమయంలో ఏఐ ఇప్పుడు వైద్యులకు తోడ్పడుతూ రోగుల మార్గదర్శకత్వం, ప్రమాద అంచనాలు, వ్యక్తిగత ఆరోగ్య ప్రణాళికల రూపకల్పనలో సహకరిస్తున్నది. అలాగే ప్రజలు వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే ముందస్తు నివారణ, ఆరోగ్య పర్యవేక్షణ, ఆరోగ్యకర జీవన నిర్వహణపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

2026 జనవరిలో ఒక్క నెలలోనే 21 బిలియన్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరగడం, 2025 మధ్య నాటికి దాదాపు 80 కోట్ల ఆరోగ్య గుర్తింపు కార్డులున్న ఆయుష్మాన్ భారత్ వంటి వసతులతో ఈ సరికొత్త మార్పును అందిపుచ్చుకునే స్థితిలో భారత్ ఉంది. జీవశాస్త్ర అవగాహన, సాంకేతిక అమలు సామర్థ్యం, వైద్య పరిపాలనా వ్యవస్థలను ఒకే వేదికపై సమన్వయం చేసే సామర్థ్యం ఉన్న హైదరాబాద్ నగరం ఈ క్రమంలో దేశంలో ప్రత్యేకంగా నిలుస్తున్నది.

కీలకమైన మూడో దశ: గత రెండు దశలను డిజిటల్ మౌలిక వసతుల ద్వారా అనుసంధానించడమే ఈ మూడో, కొత్త ట్రాన్స్‌పర్మేషన్ అని చెప్పవచ్చు. దీర్ఘకాలిక ఆరోగ్య సమాచార వ్యవస్థలు లేకుండా ఔషధ రంగం ప్రాముఖ్యత పరిమితంగానే ఉంటుంది. ముందస్తు అంచనా సామర్థ్యాలు లేకపోతే సమస్యలు వచ్చిన తర్వాతే ఆసుపత్రులు స్పందిస్తాయి. వైద్య పర్యవేక్షణ లేని సాంకేతికత భద్రతా సమస్యలకు దారితీయవచ్చు. అందుకే ఈ అన్ని రంగాల సమగ్ర అనుసంధానంలోనే మూడో దశ విలువ దాగి ఉంది.

కృత్రిమమేధ ఆధారిత వ్యవస్థ ప్రజలను వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స పొందే విధానం నుంచి నిరంతర ఆరోగ్య నిర్వహణ వైపు తీసుకెళ్తుంది. ఇందులో ముందస్తు నిర్ధారణ పరీక్షలు, బయోమార్కర్ ట్రాకింగ్, వ్యక్తిగత ఆరోగ్య సూచనలు, వైద్యుల పర్యవేక్షణ, కుటుంబ ఆరోగ్య సేవల సమన్వయం వంటి సేవలు ఉంటాయి. ప్రజలు యాప్ ద్వారా ఈ సేవలను వినియోగించవచ్చు.

ఆరోగ్య వివరాలను నమోదు చేయడంతోపాటు ఆరోగ్య నివేదికలు, సూచనలు పొందవచ్చు. అలాగే ప్రయోగశాలలు, వైద్య కేంద్రాలు, ఔషధ దుకాణాలు, కుటుంబ ఆరోగ్య సేవల సమన్వయ నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు. క్లిష్టమైన, కీలకమైన నిర్ణయాలు మాత్రం వైద్యుల పర్యవేక్షణలోనే కొనసాగుతాయి. అయితే, ఈ క్రమంలో ప్రస్తుతం విడివిడిగా ఉన్న హైదరాబాద్‌లోని డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆసుపత్రులు, ప్రత్యేక వైద్య కేంద్రాలు, ఆరోగ్య సేవల సంస్థలు ఈ విధానంలో సమన్వయంతో కూడిన ఒక నియంత్రిత నెట్వవర్క్‌గా మారవచ్చు.

హైదరాబాద్‌కు ఉన్న సానుకూలతలు: ప్రస్తుతం హైదరాబాద్‌కు ఉన్న మూడు కీలకమైన సానుకూలతలు భారతదేశంలోని ఏ నగరానికీ లేవు. జీనోమ్ వ్యాలీతో పాటు లైఫ్ సైన్సెస్ సెక్టార్ ఎకోసిస్టమ్ శాస్త్రీయ పరిశోధనలు, వైద్య పరిశోధనలలో లోతైన సామర్థ్యాన్ని అందిస్తున్నది. హైటెక్ సిటీ ఏఐ, డేటా ఇంజినీరింగ్, డిజిటల్ నైపుణ్యాన్ని సమకూరుస్తున్నది. విస్తృతమైన ఆసుపత్రుల నెట్‌వర్క్, డయాగ్నోస్టిక్ కేంద్రాలు, వైద్య సంస్థలు ఆరోగ్య రంగంలో బాధ్యతాయుతంగా ఏఐను వినియోగించడానికి అవసరమైన వైద్య పర్యవేక్షణకు తోడ్పడుతున్నాయి.

భవిష్యత్తులో ఏఐ ఆధారిత సేవలు అనేక రాష్ట్రాలకు విస్తరించవచ్చు. అయితే అందుకు తొలుత ప్రమాణాలను నెలకొల్పే, ప్రజల విశ్వాసాన్ని సంపాదించే ఒక కీలకమైన కేంద్రం అవసరం. ఆ పాత్రను పోషించే నగరాల్లో హైదరాబాద్ ముందంజలో ఉంది.

ఫలితాలపై దృష్టిపెట్టాలి: ఈ దృక్పథాన్ని సాకారం చేయాలంటే సమతుల, ఆలోచనాత్మక చర్యలు అవసరం. భద్రత, సమాచార రక్షణ, వైద్య ప్రమాణాలను కచ్చితంగా అమలు చేస్తూనే, ప్రజా ఆరోగ్య సేవలకు సంబంధించిన ఏఐ ప్రయోగాల కోసం విధాన రూపకర్తలు వేదికలను ఏర్పాటు చేయాలి. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కూడా పరస్పర అనుసంధానానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అదే సమయంలో అతిశయోక్తి ప్రకటనలను నివారించడమూ అంతే ముఖ్యం.

ప్రారంభ దశలో జీవక్రియ ఆరోగ్యం మెరుగుదల, గుండె సంబంధిత ప్రమాదాల తగ్గింపు, ఔషధాల వినియోగంలో క్రమబద్ధీకరణ వంటి అంశాల ఫలితాలపై దృష్టిపెట్టాలి. ఈ క్రమంలో దీర్ఘకాలిక విశ్వాస నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా ఉండాలి. విశ్వవిద్యాలయాలు ఆరోగ్య విధానాలను ధ్రువీకరించి శాస్త్రీయ ఆధారాలను సమకూర్చాలి.

ఆసుపత్రులు వైద్య పర్యవేక్షణకు కేంద్ర బిందువుగా ఉండాలి. డయాగ్నోస్టిక్ కేంద్రాలు కచ్చితమైన డేటాను అందించాలి. సాంకేతిక సంస్థలు తమ వ్యవస్థలు భద్రంగా, అందరికీ అర్థమయ్యేలా చూసుకోవాలి. దీర్ఘకాలిక సంబంధాలు, స్థిరమైన విలువల సృష్టిపై ఆధారపడిన నమూనాలకు పెట్టుబడిదారులు మద్దతు ఇవ్వాలి.

ప్రపంచానికి కూడా సేవలు: హైదరాబాద్ తొలి అభివృద్ధి దశ ప్రపంచానికి అందుబాటు ధరల్లో ఔషధాలను అందించింది. రెండో దశ ప్రపంచ స్థాయి సాంకేతిక సామర్థ్యాన్ని నిర్మించింది. ఇక మూడో దశకు మాత్రం భారత్‌కే కాకుండా, ప్రపంచానికి కూడా మరింత ఆరోగ్యకరమైన జీవనానికి అవసరమైన మౌలిక వ్యవస్థను అందించే సామర్థ్యం ఉంది.

ఇందుకోసం లైఫ్‌సైన్సెస్, సాంకేతిక, వైద్య సంస్థలు, విధాన రూపకర్తలు తాము ఒకే దృక్పథంతో ముందుకురావాలి. డిజిటల్ మౌలిక వసతులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. ఇక మిగిలింది సంకల్పం మాత్రమే. తొలి రెండు అభివృద్ధి దశలకు బలమైన పునాదిగా నిలిచిన అదే నమ్మకం, దృఢసంకల్పం ఇప్పుడు కూడా అవసరం.

గతంలో ఎన్నోసార్లు అంచనాలను మించి రాణించిన హైదరాబాద్ మరోసారి తన సామర్థ్యాన్ని నిరూపించగలదు. స్పష్టమైన లక్ష్యం, క్రమశిక్షణతో కూడిన అమలు, దీర్ఘకాలిక దృష్టితో భారతదేశ ఏఐ ఆధారిత మౌలిక వ్యవస్థకు పుట్టినిల్లుగా మారే అవకాశం, సామర్థ్యం ఈ నగరా నికి ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.