అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి, మే 2 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల వంటివని, రెండింటిని సమానంగా ముందుకు తీసుకుపోవడమే ప్రభుత్వ లక్ష్యం అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పేర్కొన్నారు. శనివారం వనపర్తి పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వనపర్తి నియోజకవర్గ స్థాయి కార్యక్రమం నిర్వహించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు పారదర్శకమైన, బాధ్యతాయుతమైన సేవలు అందుతున్నాయని జిల్లెల చిన్నారెడ్డి తెలిపారు. పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటి సంతకం మహిళా శక్తి పథకంపై చేశారని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేన రెడ్డి సూచించారు.
ప్రజా పాలన కార్యక్రమం ద్వారా పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పరిపాలన అందిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు రూ. 313 కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ రుణాల రెండు సంవత్సరాల సంబంధించిన చెక్కును, స్వయం సహాయక సంఘాలకు రూ.12.32 కోట్ల విలువైన వడ్డీ లేని రుణాలు చెక్కును ముఖ్య అతిథులు అందజేశారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.
కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్య నాయక్, జెడ్పి సీఈవో యాదయ్య, వనపర్తి మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, పెబ్బేరు మున్సిపల్ వైస్ చైర్మన్ సుమిత్ర, పెబ్బేరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ ప్రమోదిని, సిపిఓ హరికృష్ణ, డిఆర్డిఓ ఉమాదేవి, జిల్లా స్థాయి అధికారులు, కౌన్సిలర్లు ఇతర ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.






