calender_icon.png 4 July, 2025 | 1:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

26-05-2025 11:25:40 PM

ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి..

జైపూర్/చెన్నూర్: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి(Chennur MLA Vivek Venkataswamy) అన్నారు. సోమవారం జిల్లాలోని జైపూర్ మండల కేంద్రంలో గల సింగరేణి థర్మల్ విద్యుత్ ప్లాంట్(Singareni Thermal Power Plant) సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ కుమార్ దీపక్, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్ లతో కలిసి హాజరై వివిధ శాఖల జిల్లా అధికారులు, తహశిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో చెన్నూర్ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజా ప్రయోజనక కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చెన్నూర్ నియోజకవర్గంలో చేపట్టిన పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ప్రజలకు త్రాగునీటికి ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, మిషన్ భగీరథ, అమృత్ 2.0 పథకాల ద్వారా శుద్ధ-మైన త్రాగునీటిని సరఫరా చేయాలని తెలిపారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలలో అంతర్గత రహదారులు, మురుగు కాలువలలో చెత్త చెదారం లేకుండా పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని, ప్రతి రోజు తడి చెత్త, పొడి చెత్తలను ఇంటింటి నుండి సేకరించి డంపింగ్ యార్డుకు తరలించాలని తెలిపారు. ఆస్తి పన్ను వసూలు ప్రక్రియను 100 శాతం పూర్తి చేసేలా చూడాలని తెలిపారు.

కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా శాఖ అధికారులు పర్యవేక్షించాలని, విద్యుత్ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వర్షాకాలం సమీపిస్తున్నందున వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గ్రామాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, విధుల పట్ల సమయపాలన పాటించాలని తెలిపారు. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేలా అధికారులు పర్యవేక్షించాలని, పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా గుత్తేదారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ప్రజా ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖల ఇంజనీరింగ్ విభాగం అధికారులు తమకు కేటాయించిన అభివృద్ధి నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ప్రణాళిక అధికారి జి. సత్యం, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.