calender_icon.png 12 May, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలి

11-03-2025 07:42:37 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్  నుండి జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా పంచాయితీ, హౌసింగ్ అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, ఎ. పి. ఓ. లు, పంచాయతీ కార్యదర్శులతో అభివృద్ధి పనుల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి నెలాఖరులోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

వేసవికాలంలో ప్రజలకు ఎలాంటి త్రాగునీటి సమస్య లేకుండా ముందస్తు ప్రణాళికతో నిరంతరం త్రాగునీరు అందించే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. వేసవిలో గ్రామ పంచాయతీల పరిధిలోని నర్సరీలలో మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి దారించాలని తెలిపారు. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో ఆస్తి పన్నును 100 శాతం వసూలు చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. సి.ఎస్.సి. నిర్మాణ పనులను పూర్తి చేయాలని తెలిపారు. లే అవుట్ లేని భూముల క్రమబద్దీకరణ కొరకు ఎల్ఆర్ఎస్-2020 లో భాగంగా అందిన దరఖాస్తులను రెవెన్యూ రికార్డులు, దస్తావేజులు సరిచూసి, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ప్రజా పాలనలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అర్హత గల వారికి ఇందిరమ్మ ఇల్లు అందే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా జాబ్ కార్డులు కలిగిన కుటుంబాలకు 100 రోజులు పని దినాలు కల్పించాలని, అవసరమైన ప్రాంతాలలో ఉపాధి కూలీల సంఖ్య పెంచాలని తెలిపారు. వేసవికాలం అయినందున పని ప్రదేశాలలో కార్మికుల ఆరోగ్య రక్షణ దిశగా ఉదయం, సాయంత్రం వేళలలో ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న సమయంలో పనులు చేయించడంతో పాటు త్రాగునీరు, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని, నీడ సౌకర్యం కల్పించాలని తెలిపారు. అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.