calender_icon.png 13 May, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతి పుష్కరాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ కిరణ్ ఖరే

12-05-2025 08:44:44 PM

మహదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో జరగబోవు సరస్వతీ పుష్కరాల సందర్భంగా 15 నుండి 26 వరకు 12 రోజుల పాటు నిర్వహించనున్న పుష్కరాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు  చేసినట్లు జయశంకర్ (భూపాలపల్లి)  జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే తెలిపారు. సోమవారం  కాళేశ్వరంలో పుష్కర ఘాట్ల సందర్శనతో పాటు పోలీసు భద్రత ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాలను ఎస్పీ పరిశీలించారు. అనంతరం ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ... సరస్వతి పుష్కరాలకు తెలంగాణతో పాటు, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, ఆంధ్రప్రదేశ్, వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున  భక్తులు వస్తారని, పేర్కొన్నారు.

సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర చత్తీస్గడ్ పోలీసులతో సమన్వయంతో పనిచేస్తున్నామని, గోదావరి పరివాహక ప్రాంతాల్లో  పకడ్బందీ భద్రతా చర్యలను చేపట్టామని తెలిపారు. పుష్కరాల సందర్భంగా మల్టీ  జోన్-1 నుంచి సుమారు 3500  మంది పోలీసు అధికారులు, సిబ్బంది  మూడు  షిఫ్ట్ ల్లో విధులు నిర్వర్తించనున్నారని చెప్పారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా శాంతి భద్రతల పర్యవేక్షణ చేస్తామన్నారు. 200 సీసీ కెమెరాలు,డ్రోన్ కెమెరాలను  కమాండ్ కంట్రోల్‌కి అనుసంధానించామని వెల్లడించారు. తద్వారా ట్రాఫిక్, శాంతి భద్రతలను 24 గంటలు పర్యవేక్షిస్తామన్నారు.   పుష్కరాలకు తరలి వచ్చే భక్తుల వాహనాలు  పార్కింగ్ స్థలాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

వాహనాలు నిలపడానికి మొత్తం 14  పార్కింగ్ స్థలాలు, 7 హోల్డింగ్ పాయింట్స్ సంసిద్ధంగా ఉన్నయన్నారు. ఏవైనా కారణాలతో వాహనాలు రోడ్డుమధ్యలో నిలిచిపోతే తొలగించేందుకు క్రేన్లు, టోవింగ్‌ వాహనాలు, జేసీబీలను సిద్ధంగా  ఉన్నాయని, మరోవైపు పుష్కరాలలో దొంగతనాలు నివారణకు క్రైమ్ పోలీసులు పనిచేస్తారని అలాగే పాత నేరస్థులపై నిఘా వేసి ఉంచామని పేర్కొన్నారు. మహిళలు, చిన్న పిల్లల రక్షణ కోసం ప్రత్యేక మహిళా పోలీసు విభాగంతో పాటు, షి టీమ్ లు పనిచేస్తాయని అన్నారు. అంతే కాకుండా హైదరాబాద్  వరంగల్  నుంచి వచ్చే వాహనాలు కాటారం నుండి  పలుగుల మూల మలుపు రోడ్డు నుండి కాళేశ్వరం చేరుకోవాలని,  కరీంనగర్  నుంచి వచ్చే వాహనాలు మంథని, గంగారం మూల మలుపు నుండి పలుగుల మూల మలుపు  రోడ్ మీదుగా కాళేశ్వరం  రావాలని, తెలిపారు.

వివిధ రాష్ట్రాలు  మహారాష్ట్ర , చత్తీస్గడ్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల నుంచి వచ్చే వాహనాలు  సిరోoచ అంతర్రాష్ట్ర వంతెన  నుంచి కాళేశ్వరం చేరుకోవాలని, భక్తుల సౌకర్యార్థం ఉచిత సెటిల్ బస్ లు నడపనున్నారని, ఘాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా ఎన్ డి ఆర్ ఎఫ్ , ఎస్ డి ఆర్ ఎఫ్ సింగరేణి,  రెస్క్యూ  టీంలు , పోలీసులు పనిచేస్తారని  ఎస్పీ  అన్నారు.భక్తుల క్షేమమే జిల్లా పోలీసుల అభిమతమని, ప్రజలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బోనాల కిషన్, కాటారం, భూపాలపల్లి, వర్టికల్  డిఎస్పిలు  రామ్మోహన్ రెడ్డి, సంపత్ రావు, నారాయణ నాయక్, మహదేవపూర్, కాటారం, సిఐ లు రామచందర్ రావు, నాగార్జున రావు, నరేశ్, కాళేశ్వరం ఎస్సై తమాషా రెడ్డి, జిల్లా పరిధిలోని  ఎస్సైలు పాల్గొన్నారు.