దేవి గుండె ధైర్యం గొప్పది!
అప్పుడామె వయస్సు ఇరవై నాలుగేళ్లు. ఆమె నాకు కళాశాలలో ప్రత్యక్ష శిష్యురాలేమీ కాదు. కానీ, అదృష్టవశాత్తు శిష్యురాలైంది తర్వాతి కాలంలో. అది 1999 ప్రాంతం. అప్పటికి ఆరు పుస్తకాలు ప్రచురించి, ఏడవ పుస్తకాన్ని ప్రచురించాలనుకున్నాను. దాన్ని డీటీపీ చేయించడానికి వారాసిగూడలోని ఎస్‌కే సాఫ్ట్ సొల్యూషన్స్ సెంటర్‌కు వెళ్లాను.
దాని యజమాని రావికంటి దీన్‌దయాళ్. ఫోన్ లో మాట్లాడినప్పుడు ‘మీకెందుకండి ఎంత తొందరలో అంటే అంత తొందరలో మీకు పుస్తకాన్ని డీటీపీ చేసి ఇచ్చేవాళ్లున్నారు మా కంప్యూటర్ సెంటర్‌లో’ అన్నారు దీన్‌దయా ళ్. ఆ సెంటర్‌లో పనిచేస్తున్న అమ్మాయే దేవి. ఆమె తప్పులు లేకుండా తెలుగు, ఇంగ్లీ ష్ టైప్ చేయగలిగిన సమర్థురాలు. సైన్స్ గ్రాడ్యుయేట్ అయినప్పటికీ దేవి తెలుగులో డీటీపీ చక్కగా చేయగలదు.
నా ‘బ్రహ్మచర్యం’ చిత్తు ప్రతిని ఆమెకప్పగించి నాలుగు రోజులాగాను. అమ్మాయి దేవి ఫోన్ చేసి ‘మీ బ్రహ్మచర్యం’ డీటీపీ అయ్యింది. ప్రూఫ్ రీడింగ్ చేయడానికి రండి’ అన్నది. నేను కంప్యూటర్ సెంటర్‌కు వెళ్లిన తర్వాత ఆమె కాపీ ఒకటి అందజేసింది.
‘ఇంత తొందరగా ఎట్లా టైప్ చేయగలిగారు, పుస్తకం యాభై పేజీలది కదా’ అన్నా ను. ‘మీ బ్రహ్మచర్యం పుస్తకం నన్ను బాగా ఆకర్షించింది. అందుకే పని తొందరగా పూర్తిచేశాను’ అని సమాధానం వచ్చింది. ‘ఏమైనా తప్పులుంటే సరిదిద్దండి. ఇక్కడే మీ సమక్షంలో సరిచేసి ఇవ్వగలను’ అని వినయంగా చెప్పింది. నేను కాపీని అటూ ఇటూ తిరిగేశాను. పుటకు రెండు మూడు తప్పులుండవచ్చుగాని, పుస్తకం అంతా తప్పులు లేకుండానే కనిపించింది. ఆమె వెంటనే తప్పులు సరిచేస్తానన్నది కనుక, నేను రెండు గంటలక్కడే ఉండి ప్రూఫ్ రీడింగ్ చేశాను. ఆమె ఒక పది నిమిషాల్లో తప్పులు సరిదిద్ది శుద్ధప్రతిని చేతికందించింది. అప్పుడు నాకు కలిగిన సంతోషం ఇంతంత కాదు.
ఈ పుస్తకానికి ముందు 1991లో ‘నేత్రోదయం’ అనే నా వచనకవితా సంపుటి అచ్చ యింది. దాన్ని ప్రగతి మహావిద్యాలయం ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్‌టీ వేదాచలానికి అం కితం చేశాను. ఆయన కోరిక మేరకు నేను సికింద్రాబాద్‌లోని కంచరబజార్‌లో గల ప్రింట్ షాప్‌కు వెళ్లవలసి వచ్చింది, దాన్ని ప్రింట్ చేయడానికి. చిత్రమేమిటంటే ఆ పుస్తకం అచ్చు కావడానికి రెండు సంవత్సరాలు పట్టింది.
అమ్మాయి దేవి పుణ్యమా! అని బ్రహ్మచర్యం పుస్తకం డీటీపీ అయి, పుస్తకం రూపంలో రావడానికి రెండు మూడు నెలల కంటే ఎక్కువ సమయం పట్టలేదు. నేనున్న బౌద్ధనగర్‌కు వారాసిగూడ చాలా దగ్గర్లోనే ఉంటుంది. నడిచి వెళ్లి రావచ్చు. వాహనం తో పని లేదు.
కంప్యూటర్ సెంటర్‌లో ఒక రోజు ఆమె ను అడిగాను ‘బ్రహ్మచర్యం’ అనే పుస్తకాన్ని అంత తొందరగా డీటీపీ చేయడానికి కారణమేమైనా ఉందా?’ అని. అప్పుడామె నాకి చ్చిన సమాధానం ఆశ్చర్యాన్ని కలిగించింది. ‘సార్ నేను బ్రహ్మచారిని. నాకింకా పెళ్లి కాలే దు. బహుశా జీవితంలో పెళ్లి చేసుకోకపోవచ్చు. బ్రహ్మచర్య పాలన ఎలా ఉండాలో నాకు మీ పుస్తకం ద్వారా అనేక విషయాలు తెలిశాయి’ అని జవాబు ఇచ్చింది.
‘మీరెందుకు పెళ్లి చేసుకోరు’ అని నేనేమీ అడుగలేదు. అడిగినా ఆమె చెప్పకపోవచ్చు. కొందరి హృదయాలు సున్నితమైనవి.మనం అలాంటి వారితో చా లా జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే నేను ఆమెనేమీ ఇబ్బంది పెట్టలేదు కారణం చెప్పమని.
బ్రహ్మచర్యం పుస్తకం తర్వాత ‘ప్రకృతి పురుష వివేకం’ అనే పుస్తకాన్ని డీటీపీ చేయవలసిందిగా దేవిని కోరాను. ఆమె దాన్ని ఒక వారం రోజుల్లో టైప్ చేసి అందజేసింది. ప్రూఫ్‌లు దిద్దాలని కాపీని నాచేతికిస్తూ ‘మీకు వేదాంతం అంటే ఇష్టమా?’ అని అడిగింది.
‘ఔను వేదాంతం అంటే నాకు చాలా ఇష్టం. పండితగోపదేవశాస్త్రి దగ్గర న్యాయవైశేషికాది దర్శన గ్రంథాలతోపాటు వేదాంత దర్శనం కూడా అభ్యసించాను’ అని అన్నా ను. దానికి సమాధానంగా ‘నేను పెళ్లి చేసుకోకుండానే వేదాంతినయ్యాను’ అంది. అప్పుడు సమయం వచ్చింది కాబట్టి, ఆమె మాటలకు స్పందిస్తూ ‘మీరెందుకు పెళ్లి చేసుకోలేదు’ అని సూటిగా అడిగాను.
‘మీరడిగిన ప్రశ్న ఎవరు వేసినా ఇంతకాలం దాన్ని దాటవేస్తున్నాను. చివరికి మా తల్లిదండ్రులకు కూడా చెప్పని విషయం మీకు చెబుతున్నాను. మీరు తండ్రి లాంటివారు కనుక’ అని తన వ్యక్తిగత విషయం తెలియజేసింది. తాను డిగ్రీలో ఫస్ట్ క్లాసు విద్యార్థిన ని, తన చదువేదో తాను చదువుకుంటున్న సమయంలో వరుసకు తన బం ధువుల అబ్బాయి తనతో చాలా స్నేహంగా ఉండేవాడని, అతని వ్యక్తిత్వానికి తాను ఆకర్షితురాలి నయ్యానని, తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాన్ని కూడా తిరస్కరించానని, కానీ విధి వక్రీకరించి అతడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని అమెరికాకు వెళ్లిపోయాడని,
నామానాన నన్ను ఉండనివ్వకుండా, నాతో పెళ్లి ప్రస్తావన తెచ్చిన వ్యక్తి హఠాత్తుగా మారిపోవడం నాకు ఎంతో బాధ కలిగించిందని, పెళ్లి చేసుకుంటానన్న వ్యక్తి తన దగ్గరికి వచ్చి శుభలేఖను చేతిలో పెట్టి “సారీ” అనే ఒక మాటతో నాకు సంతృప్తి కలిగించాలనుకోవడం దుర్మార్గం కాదా! అని, ఈ కారణం గానే తాను జీవితంలో బ్రహ్మచర్యం పాటించాలనుకుంటున్నానని తన జీవిత గాథను కన్నీటితో తడుపుతూ తెలియజేసింది.
దేవి తన చరిత్రను తెలిపిన తర్వాత ఒక రోజు తన ఇంటికి భోజనానికి పిలిచి తల్లిదండ్రులకు పరిచయం చేసింది. ఆమె తండ్రి సరళ స్వభావుడు, సౌమ్యుడు. ఆయన సేకరించిన వివేకానంద సాహిత్యాన్ని నాకు చూపి, తాను వివేకానందుని రచనల పట్ల ప్రభావితుడినయ్యానని తెలియజేశారు.
ఒకరోజు దేవితో ‘మీరు ఎన్నాళ్లని ఈ కం ప్యూటర్ సెంటర్‌లో పని చేస్తూ ఉంటారు? ఎం.ఎస్సీ పూర్తిచేసి లెక్చరర్ ఉద్యోగంలో చేరవచ్చు గదా!’ అన్నాను. ‘మీరు ప్రోత్సహిస్తే తెలుగులో ఎం.ఏ చేయాలని ఉంది’ అన్నది. అలా దేవి ఓయూ దూరవిద్య కేం ద్రం ద్వారా నాకు శిష్యురాలైంది. ఎం.ఏలో 58 శాతం మార్కులతో ఉత్తీర్ణురాలైంది. ఆ తర్వాత బీఈడీ పూర్తిచేసి ప్రైవేట్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా చేరింది.
ఒక రోజు ఆమె నాతో సరదాగా మాట్లాడుతూ ఒక మాట అన్నది. ‘లోకంలో స్త్రీల వల్ల మోసపోయిన వారి కంటే, పురుషుల వల్ల మోసపోయిన వారే ఎక్కువగా ఉంటార’ని. దేవి హృదయగతమైన పరితాపం నాకర్థమైంది. ఆమెను ఎవరూ ఓదార్చలేరు. ఆమె ధైర్యమే ఆమెకు శ్రీరామరక్ష. ఒక అధ్యాపకురాలిగా నిలబడి విద్యార్థులను తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టింది. ‘జీవితంలో ఒక నిర్ణయం తీసుకుంటే దానికి ఎల్లకాలం కట్టుబడి ఉంటా’రని సంకల్పం ఆమెది. నాకు పుత్రికా సమానురాలైన దేవి ఇప్పటికీ, యాభై ఏళ్లు దాటినా సడలని గుండె ధైర్యంతో ఉండటం ఆమె సహనానికి ఒక పరీక్ష.
వ్యాసకర్త సెల్: 9885654381






