calender_icon.png 16 February, 2026 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొమురవెల్లికి పోటెత్తిన భక్తులు

16-02-2026 12:35:25 AM

మల్లన్న స్మరణతో మారుమోగిన ఆలయం

కొమురవెల్లి, ఫిబ్రవరి 15: రాష్ట్రంలో శైవ క్షేత్రాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఆదివారం శివరాత్రి పర్వదినాన భక్తులు పోటెత్తారు. శివరాత్రి రోజున నిర్వహించే పెద్ద పట్నం వేడుకను చూడడానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. శివరాత్రి పండుగ రోజు ఉపవాసం, జాగరణ దీక్షతో పరమశివుడి ప్రతిరూపమైన మల్లికార్జున స్వామిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.

మల్లన్న క్షేత్ర పరిసర ప్రాంతాలు మల్లికార్జున స్వామి స్మరణతో మారుమోగాయి. ఆలయ పరిసర ప్రాంతాలు భక్తజనసంద్రంగా మారాయి. మల్లన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు పట్నాలు, బోనాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అభిషేకాలు చేశారు. స్వామివారి దర్శనానికి మూడు గంటలు పైగా సమయం పట్టింది. పెద్దపట్నం వేడుకలు చూడడానికి పరిసర ప్రాంతాలే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చారు. ఆదివారం రాత్రి ఒగ్గు పూజారులు పట్నం రచించడానికి పూనుకుంటారు.

తెల్లవారుజాము వరకు పట్నాన్ని రచిస్తారు. అనంతరం గర్భాలయం నుంచి ఆలయ అర్చకులు ఉత్సవమూర్తులను తీసుకొచ్చి ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం శివసత్తులు, భక్తులు శివనామస్మరణ చేసుకుంటూ, తన్మయత్వం పొందుతూ పట్నం దాటుతారు. పట్నం దాటిన భక్తులు గర్భాలయంలో ఉన్న మూలవిరాట్ ను దర్శించుకుంటారు.