1 April, 2026 | 10:23 AM

యాదాద్రికి పోటెత్తిన భక్తులు

06-05-2024 01:13 AM

వేసవి సెలవుతో పెరిగిన రద్దీ

దర్శనానికి ౩ గంటల సమయం

యాదాద్రి భువనగిరి, మే 5 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో మహి మాన్విత పుణ్యక్షేత్రం యాదాద్రి (యాదగిరిగుట్ట) ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో పాటు వేసవి సెలవులు కలిసి రావడంతో యాదాద్రి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం ఉదయం నుంచే భక్తులు క్యూలైన్లలో నిల్చొని స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ధర్మ దర్శనానికి దాదాపు మూడు గంటల పాటు భక్తులు క్యూలైన్లలో వేచిచూడాల్సి వచ్చింది. ఆలయంలో స్వామి వారికి ఉదయం సుప్రభాత సేవ, బాలభోగం, అర్చన అభిషేక పూజలను ఘనంగా నిర్వహించారు.

ఆలయ ఉత్సవ మండపంలో సుదర్శన నరసింహ హోమం నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలతో లక్ష్మినృసింహ స్వామి వారి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం పట్టువస్త్రాలు, బంగారు ముత్యాల ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించి వెండి జోడి సేవ జరిపారు. స్వామివారి ఆర్జిత సేవలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం రోజు సుమారు 55 వేల మంది భక్తులు వచ్చి ఉంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఒక్కరోజులోనే రూ. 53,32,909 హుండీ ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 

భక్తులపై భానుడి ప్రతాపం

యాదగిరి నృసింహుడి దర్శనానికి పిల్లా పాపలతో వచ్చిన భక్తులు భానుడి తాపానికి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కొండపై ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తులు భారీగా తరలిరావడంతో ఇబ్బందులు తప్పలేదు. కొండపై మ్యాట్లు వేసినప్పటికీ భక్తులకు సరిపోని కారణంగా మహిళలు, పిల్లకు ఇబ్బందులు తప్పలేదు. 

ప్రముఖుల దర్శనం

యాదాద్రి లక్ష్మినృసింహుడిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడు రాజేంద్ర విజయ్, టీఎస్‌ఐఐసీ వైస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.