ఖమ్మంలో ద్విముఖ పోరే!
వేసవిని మించిన రాజకీయ వేడి
కాంగ్రెస్ బీఆర్‌ఎస్ మధ్యే పోటీ
టీడీపీ సానుభూతి ఓట్లు పడేదెవరికో?
ఖమ్మం, మే 5 (విజయక్రాంతి): ఖమ్మం లోకసభ పోరు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. ఇక్కడ ముక్కోణపు పోటీ ఉం టుందని భావించినా.. ద్విముఖ పోరే కనిపిస్తున్నది. గత ఎన్నికల్లో ఖమ్మంలో కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ రేణుకాచౌదరిపై సునాయాసం గా గెలిచిన నామా నాగేశ్వర్‌రావుకు ఈసారి ఎదురీత తప్పేలాలేదు. పదేండ్లపాటు తెలంగాణాను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఉద్యమ పార్టీ పరిస్థితి రాజకీయంగా వెనుకపడిపోనట్టు కనిపిస్తున్నది. ఇటీవల ఖమ్మం సభలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన సందేశం ఆ పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేసినట్టు తెలుస్తుంది. ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వర్‌రావు గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారని కేసీఆర్ చెప్పడం పార్టీ శ్రేణుల్లో చర్చ నీయాంశంగా మారింది. అటు బీజేపీ నుంచి టికెట్ ఆశించిన జలగం వెంకట్రావుకు కాకుండా ముల్కలపల్లికి చెందిన తాండ్ర వినోద్‌రావుకు కేటాయించింది. ఆయన ప్రచారం బాగానే చేస్తున్నా.. వామపక్ష భావజాలం, బీజేపీ నిర్మాణం క్షేత్రస్థాయిలో లేనందున బీజేపీ గెలిచే స్థాయిలో ప్రభావి తం ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.దీంతో పోటీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్యే ఉంటుందని భావిస్తున్నారు.
టీడీపీ ప్రసన్నం కోసం..
రాష్ట్ర విభజన తర్వాత కూడా ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రాబల్యం తగ్గలేదా? అన్న చర్చ ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రసన్నం చూసుకునేందుకు బరిలో నిలిచిన ప్రధాన పార్టీలు పడుతున్న పాట్లు చూస్తే అనుమానాలు కలుగుకమానవు. వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రాలో బీజేపీ, జనసేనతో ఎన్నికల పొత్తులో ఉన్నా రు. కానీ, ఖమ్మంలో మాత్రం టీడీపీ మద్దతు ఎవరికి అనేది ఇంకా స్పష్టత లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి టీడీపీ కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు పలుకుతుందన్న ఆశతో ఉన్నారు.
కాంగ్రెస్‌లో ఆత్మవిశ్వాసం
ఖమ్మం జిల్లా రాజకీయాలు భిన్నత్వాన్ని ప్రదర్శిస్తాయి. రాజకీయంగా చైతన్యవంతమైన ప్రాంతం ఇది. సీఎం రేవంత్‌రెడ్డి సైతం కొత్తగూడెం సభ నుంచి చేసిన ప్రసంగంలో ఈ విషయాన్ని తేల్చారు. బీఆర్‌ఎస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు కాంగ్రెస్‌లో చేరిన తర్వాత ప్రతిరోజు బీఆర్‌ఎస్ నుంచి నాయకులు కాంగ్రెస్‌లోకి వలస వస్తూనే ఉన్నారు. బీజేపీని నిలువరించేందుకు ఇండియా కూటమితో చేతులు కలిపిన వామపక్షపార్టీలు బేషరతుగా ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీకి ఆత్మవిశ్వాసం పెరి గింది. టీజేఏసీతోపాటు మరికొన్ని ప్రజాసంఘాలు, కులసంఘాలు కూడా కాంగ్రెస్ కు తోడయ్యాయి. చాలా చోట్ల ఖమ్మం పురప్రముఖులు స్వచ్ఛందంగా ఆత్మీయ సమ్మే ళనాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి ఆహ్వానాలు పలు కుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఖమ్మం జిల్లా కమ్మసంఘం అధ్యక్షుడు ఎర్నేని రామారావు మద్దతు ప్రకటించడం విశేషం.
టీడీపీ సానుభూతిపరులు నామా వైపా?
బీఆర్‌ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్‌రావుపై టీడీపీ సానుభూతిపరులకు మంచి అభిప్రాయమే ఉంది. నామా ఇప్పుడు గట్టిపోటీ ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నారన్న అభిప్రాయం వినిపిస్తున్నది. ఈ క్రమం లో నామా నాగేశ్వర్‌రావు వ్యూహాత్మకం గా ముందుకెళ్తున్నారు. ఆయన ఖమ్మంలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లి ఆ పార్టీ శ్రేణుల్ని ఆప్యాయంగా పలుకరించారు. అయితే ఇప్పుడు టీడీపీలో మిగిలిన నాయకుల సంఖ్య తక్కువ. చాలామంది తుమ్మలనాగేశ్వర్‌రావు, ఇతర నేతలతో కలిసి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో చేరారు. బీఆర్‌ఎస్‌లో చేరిన వారు సైతం ఏపీలో చంద్రబాబు అరెస్ట్ అనంతర పరిణామాలతో బీఆర్‌ఎస్‌కు దూరమై కాంగ్రె స్ అభ్యర్థుల గెలుపునకు దోహదపడటం గమనార్హం.
ఇటీవల కేసీఆర్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీలో మళ్లీ వైఎస్ జగన్ సర్కారే కొలువుదీరున్నదని చెప్పడం ఇక్కడి టీడీపీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. కాగా, టీడీపీ అభిమానుల ఓట్లు పొందేందుకు నామా తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. తాను బీఆర్‌ఎస్ అభ్యర్థి అనే సంగతిని పక్కన బెట్టి వ్యక్తిగతంగా తనకు మద్దతివ్వాలని కోరుతున్నారు. కమ్మ సంఘం నేతలు ఇప్పటికే కాంగ్రెస్‌కుమద్దతు పలుకగా, అందులోనే మరో వర్గం నామాకు అండగా ఉంటామని ప్రకటించడం గమనార్హం. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉన్నా.. నామా నాగేశ్వర్‌రావు ధైర్యంగా పోరాడుతున్నారనే చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఖమ్మంలో రాజకీయ సమీక రణాలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ ఏ క్షణాన ఏమి జరుగుతుందోనన్న రీతి లో రాజకీయ మార్పులు చోటుచేసుకుం టున్నాయి.




