30-12-2025 01:02:30 PM
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ రాష్ట్ర పోలీస్ వార్షిక నివేదికను(Telangana Police annual report) విడుదల చేశారు. దేశంలోనే సైబర్ క్రైమ్ 41 శాతం పెరిగిందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు సమర్థవంతంగా పనిచేయడంతో 3 శాతం తగ్గిందని వివరించారు. గతంతో పోలిస్తే 2.33 శాతం క్రైమ్ రేట్ తగ్గిందన్నారు. గతంలో 2.34 లక్షల కేసులు నమోదు కాగా, ఇప్పుడు 2.28 లక్షల కేసులు నమోదయ్యాయని తెలిపారు. గతంతో పోలిస్తే శిక్ష పడిన కేసుల సంఖ్య 3 శాతం కంటే ఎక్కువగా పెరిగిందని సూచించారు.
ఈ ఏడాది నాలుగు కేసుల్లో మరణశిక్షలు పడ్డాయని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా హత్యలు 8.76 శాతం తగ్గాయి. 13.45 శాతం అత్యాచారాలు తగ్గాయి. దోపిడీలు 27 శాతం, దొంగతనాలు 9.1 శాతం తగ్గాయి. నమ్మక ద్రోహం కేసులో 23 శాతం పెరిగాయి. వరకట్నం కోసం హత్యలు తగ్గాయి, వరకట్న వేధింపుల కేసులు 2 శాతం తగ్గాయని వెల్లడించారు. మహిళ భద్రత కోసం షీటీంలు యాక్టివ్ గా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసులు 9.5 శాతం తగ్గాయన్నారు. సైబర్ క్రైమ్ కేసుల్లో రికవరీ 23 శాతం పెరిగిందని డీజీపీ(DGP Shivadhar Reddy) వెల్లడించారు. ఈ ఏడాది రూ. 246 కోట్లు రికవరీ చేశామన్నారు. 24,498 మంది బాధితులకు రూ. 159.65 కోట్లు రిఫండ్ కూడా చేశామని వివరించారు.
అదుపులో శాంతి శాంతి భద్రతలు
తెలంగాణలో శాంతిభద్రతలు(Telangana law and order) పూర్తిగా అదుపులో ఉన్నాయని వెల్లడించారు. గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాం. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వచ్చిన వరదలను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. గతంలో ఎప్పుడూ ఇలాంటి వదరలు నిజామాబాద్ లో రాలేదన్నారు. వరదల సమయంలో పోలీసు సిబ్బంది బాగా పనిచేసి ప్రాణనష్టం లేకుండా చూశారని కొనియాడారు. తెలంగాణలో 509 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఎలాంటి సమస్యలు లేకుండా మిస్ వరల్డ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించుకున్నాం. రాష్ట్రంలో వివిధ కేసులను లోక్ అదాలత్ తో పెద్దసంఖ్యలో పరిష్కరించాం. పోలీసు శాఖలో కీలక పదవుల్లో మహిళాఅధికారులు పని చేస్తున్నారు. ఫోన్ల రికవరీ విషయంలో దేశంలో తెలంగాణ నంబర్ వన్ గా ఉందని డీజీపీ చెప్పారు.