ప్రైవేట్ ఆపరేటర్ చేతికి ధరణి తాళాలు!
పెద్దపల్లి జిల్లా మంథని డివిజన్‌లో అబాసుపాలు
రైతులతో బేరసారాలు కుదిరాకే ధరణిలో నమోదు
మంథని, జూన్ 20 (విజయక్రాంతి): వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు నిర్దేశించిన ధరణి పోర్టల్ పెద్దపల్లి జిల్లా మంథనిలో గాడి తప్పుతోంది. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటే షన్లు, ఆస్తుల బదిలీలకు పారదర్శకంగా సేవలు అందించే ఈ పోర్టల్.. మంథనిలో ప్రైవేటు ఆపరేటర్ చేతిలోకి వెళ్లడం అనుమానాలకు తావిస్తున్నది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో లొసుగులను తొలగించడం, భూమి, ఆస్తి సంబంధిత సమాచారాన్ని ఆన్లైన్‌లో స్టోర్ చేయడం, వ్యవసాయ భూముల నమోదు, వారసత్వ విభజనను సరళీకృతం చేయడానికి, మొత్తం రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కొద్ది నిమిషాల్లోనే పూర్తయ్యేలా చూడటానికి ఈ వ్యవస్థను ఏర్పాటుచేశారు.
కానీ, మంథని డివిజన్‌లోని రామగిరి, కమాన్‌పూర్ మండలా ల్లో ప్రైవేటు ఆపరేటర్లతో ఒక కార్యాలయమే ఏర్పాటు చేయడం గమనార్హం. రైతులు, భూ యజమానుల నుంచి పెద్ద మొత్తంలో వసుళ్ల పర్వం కొనసాగుతున్నట్టు బహిరంగంగా ఆరోపణలు వెల్లు త్తుతున్నాయి. గత ఎన్నికలకు ముందు ధరణి ప్రక్రియ వేగవంతం చేయడానికి రైతులకు మెరుగైన సేవలు అందించడానికి ప్రైవేట్ ఆపరేటర్ల సేవలను విని యోగించుకున్నది.
ఎన్నికల అనంతరం ప్రైవేట్ ఆపరేటర్లను పక్కన పెట్టింది. కానీ, మంథని డివిజన్‌లో మాత్రం ప్రైవేట్ ఏజెన్సీ నిర్వాహకుడు.. ఆర్డీవోతో సమానంగా కూర్చోవడం, ధరణి భూముల రిజిస్ట్రేషన్లను తానే వ్యక్తిగతం గా చూసుకోవడం, వివాదాస్పద భూ ములను పరిశీలించకుండానే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్లకు అనుకూలంగా ధరణి పోర్టర్‌లో నమోదు చేస్తున్నారని పలువురు రైతులు కార్యాలయం బయట గోడువెళ్లబోసుకుంటున్నారు. ఈ వ్యవహారం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఉందంటూ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు వాపోతున్నారు. ఈ విషయమై మంథిని ఆర్డీవో హనుమానాయక్‌ను వివరణ కోరితే.. తన దృష్టికి రాలేదని, కనుక్కొని చెప్తానంటూ దాటవేయడం కొసమెరుపు.






