18-10-2025 05:32:36 PM
విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించాలి..
మణుగూరు (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్త బందులో భాగంగా తెలంగాణ ఎలక్ట్రిసిటీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్(TEBCEWA) ఆధ్వర్యంలో బీటీపీఎస్ కర్మాగారం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. సుమారు గంట పాటు జరిగిన ఈ ఆందోళన కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొని బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ బీటీపీయస్ రీజినల్ అధ్యక్ష కార్యదర్శులు జీ.ఐలయ్య,డి. శ్రావణ్ లు ప్రసంగిస్తూ విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ పొందే వరకు ఐక్య ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు.
అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్ అమలుకు మద్దతు పలకడం శుభ పరిణామామని హర్షం వ్యక్తం చేశారు. బీసీలకు అమలు చేయాలనుకున్న 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించి ప్రభుత్వాలు తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రీజినల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాయిరాం, బీసీ లైజన్ ఆఫీసర్ కృష్ణ కాంత్ కోశాధికారి రాకేష్, తెలంగాణ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ జెనకో అసిస్టెంట్ సెక్రటరీ బి. రవి ప్రసాద్, కార్మిక సంఘం- 1535 రీజనల్ అధ్యక్షులు వి ప్రసాద్ కార్మిక సంఘం-1104 నాయకులు వెంకట్రావు, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సిద్ధల హుస్సేన్, బీసీ నాయకులు సురేష్ బాబు, సతీష్ కుమార్, రామలింగయ్య మహిళా నాయకులు ఉమాదేవి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.