20-01-2026 12:26:07 AM
ఘట్ కేసర్ పట్టణంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ కమిషన్ వాణికి మాజీ సర్పంచ్ యాదగిరియాదవ్ వినతి
ఘట్ కేసర్, జనవరి 19 (విజయక్రాంతి): మంచినీటి సరఫరా రోడ్ల సమస్యలు పరిష్కరించాలని సోమవారం ఘట్ కేసర్ సర్కిల్ కార్యాలయం ముందు పలు కాలనీల ప్రజలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఘట్ కేసర్ పట్టణంలోని ప్రధాన సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ కమిషన్ వాణి కి మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరియాదవ్ సోమవారం వినతిపత్రం అందజేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఉప్పల్ జోన్ ఘట్ కేసర్ సర్కిల్ 6వ డివిజన్ లోని నీటి, సమస్యలు, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఇరువైపులా రోడ్డు వేసి వాహనాలు రాకపోకల పునరుద్ధరణ చేయాలని ఘట్ కేసర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ వినతి పత్రంలో కోరారు. గతంలో పట్టణ ప్రజల అవసరాల నిమిత్తం ఆనాటి అధికారులు కేటాయించిన నీళ్లు సరిపోవడం లేదన్నారు.
అలాగే ఘట్కేసర్ రైల్వే వంతెన పూర్తికాక సంవత్సరాలు తరబడి ప్రజలు వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే వంతెన ఫ్లైఓవర్ కి ఇరువైపులా గల అడ్డంకులు తొలగించి వాహన రాకపోకలకు సులభంగా వెళ్ళుటకు అవకాశం కల్పించాలని, కనీసం గట్టు మైసమ్మ జాతర నాటికైనా ఫ్లైఓవర్ ఇరువైపులా బి.టి రోడ్లు వేసి డిస్టిక్ బస్సులను పట్టణం నుండి పోయే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈకార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు, వివిధ కాలనీ అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు, పాల్గొనడం జరిగింది.
సానుకూలంగా స్పందించిన డిప్యూటీ కమిషనర్
ఘట్ కేసర్ పరిధిలోని వివిధ కాలనీల ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలపై అందిన ఫిర్యాదుకు జిహెచ్‌ఎంసి డిప్యూటీ కమిషనర్ వాణి సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారం కోసం ఆమె వెంటనే ఏఈ శ్రీనివాసులు ని క్షేత్రస్థాయి పరిశీలనకు పంపించారు. అబ్బసాని యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో ఏఈ ప్రతి కాలనీని సందర్శించి అక్కడి నీటి సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈసందర్భంగా స్థానిక ప్రజలు తమ ఇబ్బందులను వారికి వివరించారు. ప్రజల కష్టాలను గుర్తించి వెంటనే స్పందించినందుకు డిప్యూటీ కమిషనర్ వాణి కి సంబంధిత అధికారులకు యాదగిరియాదవ్ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.