1 May, 2026 | 4:01 AM

పదేళ్ల తర్వాత రిలీజ్‌కు ధ్రువనక్షత్రం

01-05-2026 01:30 AM

చియాన్ విక్రమ్ కథానాయకుడిగా నటించిన ‘ధ్రువనక్షత్రం’ గుర్తుందిగా?! ఈ సినిమా విడుదలకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఈ చిత్ర విడుదలకు మద్రాస్ హైకోర్టు అనుమతినిచ్చింది. జూన్ 15 లేదా అంతకన్నా ముందు విడుదల చేసుకునేందుకు మేకర్స్‌కు వీలు కల్పించింది.

ఎంత ప్రయత్నించినా జూన్ 15లోగా విడుదల సాధ్యం కాకపోతే.. కోర్టును సంప్రదించి, సమయం కోరవచ్చని సూచించింది. అయితే, ‘కొండాడువోమ్ ఎంటర్‌టైన్‌మెంట్’ పేరిట బ్యాంకు ఖాతాను తెరవాలని షరతు విధించింది. ఇకపై దీని ద్వారానే ఈ సినిమాకు సంబంధించిన లావాదేవీలు జరగాలని ఆదేశించింది. ఓ న్యాయవాది దీనిని పర్యవేక్షిస్తారని తెలిపింది. ఈ సినిమాను 2016లో ప్రారంభించిన దర్శకుడు గౌతమ్ మేనన్.. 2017లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. కానీ, ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

2023లో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. శింబు హీరోగా గౌతమ్ మేనన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇందుకోసం రూ.2.40 కోట్లు తీసుకున్నారని, కానీ ఆయన సినిమా పూర్తి చేయకపోవడమే కాక.. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వలేదని చిత్ర నిర్మాణ సంస్థ ‘ఆల్‌ఇన్ పిక్చర్స్’ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. నగదు తిరిగి ఇచ్చేదాకా ఆయన తెరకెక్కించిన ‘ధ్రువ నక్షత్రం’ సినిమా విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వొద్దని కోరింది. అలా వాయిదా పడుతూ, ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధమైందీ చిత్రం.