09-11-2025 12:00:00 AM
ప్రపంచ దేశాల్లో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ చోటు దక్కించుకుంది. ‘ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫెడరేషన్’ వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 40 ఏండ్లు దాటిన ప్రతి 8 మంది వయోజనుల్లో ఒక్కరు మధుమేహంతో బాధపడుతున్నారని తేలింది. భారత్‌లో అత్యధికంగా వంద మిలియన్లకుపైగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
భారత్‌లో డయాబెటిస్ రుగ్మత అనేది ఒక నిశ్శబ్ద విధ్వంసంగా రూపాంతరం చెందుతు న్నది. 2015 వివరాల ప్రకారం.. 60 శాతం మంది పిల్లల్లో షుగర్ లెవల్స్ సాధారణం కంటే అధికంగా ఉన్నట్లు తేలింది. ప్రపంచవ్యాప్తంగా మధుమేహ రుగ్మత వల్ల మానవాళిపై అత్యంత సామాజిక ఆర్థిక భారం పడుతున్నది. భారత్‌లో గోవా(26.4 శాతం), పుదుచ్చేరి(26.3 శాతం), కేరళ (25.5 శాతం) రాష్ట్రాల్లో అత్యధికంగా మధుమేహం ఉన్నట్లు తేలగా.. యూపీలో అత్యల్పంగా 4.8 శాతం మాత్రమే ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
అందువల్లనే గోవా, కేరళ రాష్ట్రాలను ‘భారత మధుమేహ రాజధానులు’గా పిలుస్తున్నాం. కేవలం ఢిల్లీ మహానగరంలోనే 29.8 లక్షల మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారని నివేదికలో బయటపడింది. దేశ మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో దాదాపు మూడో వంతు పట్టణాల్లోనే ఉన్నారని, గ్రామీణుల్లో డయాబెటిస్ తక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఒకసారి డయాబెటిస్ నిర్థారణ అయితే జీవితకాలం దానిని పెరగకుండా అదుపులో ఉండే విధంగా నియంత్రించుకోవడమే ఏకైక మార్గం.
మధుమేహ భూతాన్ని తరమడానికి జీవనశైలిలో మార్పులు అవసరం. శరీర బరువును అదుపులో ఉంచుకోవడం, క్రమం తప్పకుండా కనీసం 30 నిమిషా ల వ్యాయామం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండడం, మూ డు నెలలకోసారి షుగర్ పరీక్షలు తప్పనిసరి చేయించుకోవాలి. చాప కింద నీరులా ‘సైలెంట్ కిల్లర్’ రూపంలో ప్రపంచ మానవాళిని కుదిపేసేందుకు సిద్ధంగా ఉన్న మధుమేహం వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుందాం.
మధుసూదన్, కరీంనగర్