09-11-2025 12:00:00 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో, ఏం మాట్లాడుతారో అనేది అర్థం చేసుకోవడం కష్టమే. మొన్నటిదాకా నోబెల్ శాంతి బహుమతి కోసం పరితపించిన ట్రంప్ తాజాగా అణు పరీక్షల గురించి, అణ్వాయుధాల సామర్థ్యం గురించి వీలు చిక్కినప్పుడల్లా ఉపన్యాసాలు ఇస్తూనే వస్తున్నారు. అమెరికా అణ్వస్త్ర సామర్థ్యం గురించి ప్రస్తావిస్తున్న ట్రంప్ తమ వద్ద ప్రపంచాన్ని 150 సార్లు పేల్చివేయగల అణ్వస్త్రాలు ఉన్నాయని గొప్పగా చెప్పుకున్నారు.
ఒకవైపు తాను శాంతి కాముకుడినని, అందుకోసం ప్రపంచంలో ఇటీవల జరిగిన అనేక యుద్ధాలను ఆపానని బీరాలు పలికారు. వాస్తవానికి అమెరికాకు పోటీగా ఉన్న రష్యా, చైనాలు అణ్వస్త్ర పరీక్షల్లో దూసుకుపోతున్నాయన్న విషయం ట్రంప్‌ను కుదురుగా ఉండనివ్వడం లేదు. అయితే చైనా, రష్యాలు రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని, తాను మాత్రం అలా చేయ నని, అందరికి చెప్పి మరీ అణ్వస్త్ర ప్రయోగం చేస్తానని ప్రకటించారు.
ఏది ఏమైనా అన్ని దేశాలు రహస్యంగానో, బహిరంగంగానో అణు పరీక్షలు జరుపుతుండడంతో తమ దేశం కూడా అణు పరీక్షలు జరపాల్సిన అవసరముందన్నారు. ఇక పాకిస్థాన్ కూడా రహస్యంగా అణు పరీక్షలు జరు పుతోందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. అమెరికా ఇంటలిజెన్స్ వ్యవస్థ విస్తృతమైనది గనుక, వాళ్ల సమాచారం సరైనదే అయి ఉండొచ్చని భారత్ పేర్కొంది.
అలాగే అంతర్జాతీయ చట్టాలను తుంగలోకి తొక్కి దొంగచాటుగా అణు కార్యక్రమాలు నిర్వహించడం పాక్‌కు అలవాటేనని భారత విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. భారత్‌ను తప్పుడుగా చూపిస్తూ పాకిస్థాన్ అణ్వస్త్ర సామర్థ్యాన్ని పెంచుకుంటోందనే వార్తలు వస్తున్నాయి. అయితే పాక్‌లో ఆకలి కేకలు మిన్నంటుతున్న తరుణంలో ప్రజలకు ఆపన్నహస్తం అందించడం మానేసి అణు పరీక్షల ప్రయత్నాల్లో మునిగిపోవడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది.
పాకిస్థాన్ అణు రహస్య కార్యకలాపాలపై తనకు కచ్చిత సమా చారం ఉందని ట్రంప్ పేర్కొంటున్నప్పటికీ దానికి సంబంధించి వివరాలు ఇప్పటివరకు బయటపెట్టలేదు. ఇటీవల దక్షిణకొరియాలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో ట్రంప్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఒప్పందాల కోసం చర్చలకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించిన ట్రంప్.. ఇప్పుడు మాత్రం చైనా చేస్తున్న అణు పరీక్షల గురించి ప్రస్తావించడం జిన్ పింగ్‌ను ఆశ్చర్యంలోకి నెట్టేసింది.
ఒకవైపు అమెరికాలో షట్‌డౌన్ రోజుల తరబడి కొనసాగుతుంటే, ట్రంప్ ఆ సమస్యకు పరిష్కారం ఆలోచించడం మానేశారు. ఇటీవలే న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లోనూ, వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ ఎన్నికల్లోనూ ప్రజాభిప్రాయం ట్రంప్‌కు వ్యతిరేకంగా వ చ్చింది. సొంత దేశంలో ప్రస్తుతం నెల కొన్న పరిస్థితుల నుంచి ప్రపంచ ప్ర జల దృష్టిని మళ్లించడానికే అణు పరీక్షలనే కొత్త మాటను ట్రంప్ ఎత్తుకున్నారనిపిస్తుంది.
అమెరికా వీసాల కోసం కొత్త నిబంధనలను ప్ర వేశపె ట్టడం, ఊబకాయం సమస్యలు ఉంటే వీసా రాదంటూ అర్థం పర్థం లేని ట్రంప్ వ్యాఖ్యలతో అమెరికాలో చదువుకోవాలని భావించిన విదేశీ విద్యార్థులు ఇవాళ జర్మనీ, చైనాలకు క్యూ కడుతున్నారు. మొత్తంగా స్వదేశంలో ప్రజల్లో తనపై వచ్చిన వ్యతిరేకతను మరిపించడానికే ట్రంప్ పదే పదే అణు పరీక్షల నామస్మరణ చేస్తున్నారనిపిస్తుంది.