ప్రభాత్ జయసూర్యపై ఐసీసీ చర్యలు
- అంపైర్‌పై తీవ్ర ఆగ్రహం
- బ్యాట్‌తో బౌండరీ లైన్‌ను కొట్టిన లంక క్రికెటర్
కొలంబో, ఆగస్టు 25 : శ్రీలంక క్రికెటర్ ప్రభాత్ జయసూర్య ఐసీసీ ఆగ్రహానికి గురయ్యాడు. అంపైర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు క్రికెట్ పరికరాలు ధ్వంసం చేసినందుకు ఐసీసీ అతనిపై చర్యలు తీసుకుంది.రెండో రోజు ఆట ముగిసే సమయంలో భారత స్పిన్నర్ మానవ్ సుతార్ బౌలింగ్లో జయసూర్య ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఆ తర్వాత తీవ్ర అసహనంతో పెవిలియన్ వైపు వెళ్తూ బౌండరీ లైన్ ను తన బ్యాట్తో బలంగా కొట్టాడు.
అలాగే డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లాక గ్లౌజ్లను విసిరేశాడు.అంతర్జాతీయ మ్యాచ్ల సమయంలో క్రికెట్ పరికరాలు, మైదాన సామగ్రిని దుర్వినియోగం చేయడం ఐసీసీ నియమావళి ప్రకారం తప్పిదం. ఈ క్రమంలోనే ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఆర్టికల్ 2.2 (లెవెల్ 1) కింద జయసూర్య నిబంధనలను ఉల్లంఘించినట్లు మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ నిర్ధారించారు. ప్రభాత్ జయసూర్య తన తప్పును అంగీకరించడంతో అధికారిక విచారణ అవసరం లేకుండానే ఈ వ్యవహారం ముగిసింది.
గత 24 నెలల్లో జయసూర్య చేసిన తొలి తప్పిదం కావడంతో కేవలం మందలింపు, ఒక డీమెరిట్ పాయింట్తో సరిపెట్టారు. ఇదే మ్యాచ్లో ఐసీసీ క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొన్న మూడో ఆటగాడు ప్రభాత్ జయసూర్య. అంతకుముందు మొదటి రోజు ఆటలో జరిగిన వివాదానికి సంబంధించి జైస్వాల్ , ఫెర్నాండోలకు ఐసీసీ జరిమానా విధించింది.






