వామపక్ష కూటమి లెఫ్ట్!
- ఎల్‌డీఎఫ్ పతనానికి కారణాలు అనేకం
- శబరిమల వివాదం.. గోల్డ్‌స్మగ్లింగ్ ఆరోపణలు మైనస్
- నిరుద్యోగ సమస్య.. ఆర్థిక సంక్షభమూ శరాఘాతాలు
- ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో యూడీఎఫ్ విజయం
త్రివేండ్రం, మే ౪: కేరళం రాజకీయాల్లో పెను మార్పు చోటుచేసుకుంది. దశాబ్ద కాలంగా కొనసాగుతున్న లెఫ్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) పాలనకు రాష్ట్రప్రజలు చరమగీతం పాడారు. కాంగ్రెస్ నేతత్వంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)కు పట్టంగట్టారు.పదేళ్ల పాటు అధికారంలో ఉన్న పినరయి విజయన్ ప్రభుత్వంపై ఉన్న తీవ్ర వ్యతిరేకత ఈ మార్పునకు ప్రధాన కారణమైం ది. వారి పాలనపై విసుగు చెందిన ప్రజలు యూడీఎఫ్ వైపు మొగ్గు చూపారు.
ప్రభుత్వ ఆర్థిక వైఫల్యాలను యూడీఎఫ్ సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి విజయం సాధిం చింది. ఓటర్ల జాబితాలో అక్రమాలు, పేర్ల తొలగింపు వంటి అంశాలపై కూడా క్రియాశీలకంగా వ్యవహరించింది. నిజమైన అభివృద్ధి కావాలని కోరుకున్న విద్యావంతులైన కేరళం ఓటర్లు ఈసారి మార్పునకు శ్రీకారం చుట్టారు.
పరాజయానికి గల కారణాలు
వీడీ సతీశన్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో చేసిన కృషి యూడీఎఫ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ఎన్నికల ప్రచారం యువతను, సామాన్య ఓటర్లను ఆకర్షించింది.
కేరళంలో ఆర్థిక సంక్షోభం ఎల్‌డీఎఫ్‌ను అప్రతిష్ఠ పాలు చేసింది. వారి పాలనలో రాష్ట్రం రూ.4 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయింది. ఉద్యోగుల వేతనాలు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ల చెల్లింపు కోస మూ సర్కార్ అప్పులు చేయాల్సి రావడం ప్రజల్లో ఆందోళన కలిగించింది. ఆర్థిక క్రమశిక్షణ లేని పాలనపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణలు ప్రభుత్వ ప్రతిష్ఠను బాగా దెబ్బతీశాయి.
శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం అంశం రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపింది. అన్ని వయసుల మహిళలకు ప్రవే శం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. ఇది అయ్యప్ప భక్తుల్లో తీవ్ర అసంతృప్తిని నింపింది. ఆచారాలను గౌరవించడంలో ప్రభుత్వం విఫలమైందనే భావన ఓటర్లలో బలంగా నాటుకుంది. 2025లో ఆలయంలోని విగ్రహాల బంగా రు తాపడం (గోల్డ్ ప్లేటింగ్) తొలగింపు వ్యవహారం మరో వివాదానికి దారితీసిం ది. కోర్టు అనుమతి లేకుండానే ఈ పనులు చేపట్టడంపై హైకోర్టు మండిపడింది.
రాష్ట్రాన్ని కుదిపేసిన గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఎల్‌డీఎఫ్ పెద్ద మచ్చగా మిగిలింది. తిరువనంతపురం విమానాశ్రయం మాధ్యమం గా దౌత్య మార్గాల్లో బంగారం స్మగ్లింగ్ జరగడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధా లు ఉన్నాయనే ఆరోపణలు యూడీఎఫ్‌కు పెద్ద అస్త్రంగా మారాయి. స్వప్నా సురేశ్ వంటి వ్యక్తుల అరెస్టు, కేంద్ర సంస్థల విచారణతో ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి లోనయింది.
మైనారిటీ వర్గాల మద్దతు ఈసారి ఎల్‌డీఎఫ్‌కు తగ్గింది. క్రైస్తవ, ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో యూడీఎఫ్ వైపు నిలిచారు. ముఖ్యమంత్రి విజయన్ చేతుల్లోనే అధికారం కేంద్రీకృతం కావడం కూడా పార్టీలో, ప్రజల్లో అసంతృప్తికి దారితీసింది.
రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగం, మేధో వలసలు (బ్రెయిన్ డ్రెయిన్) ఎన్నికల్లో ప్రధాన ఎజెండాగా మారాయి. ఉన్నత చదువులు చదివిన యువత ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాల్సి రావడంపై అసంతృప్తి వ్యక్తమైంది. యూడీఎఫ్ ఈ సమస్యను గుర్తించి తమ మ్యానిఫెస్టోలో యువతకు భరోసా కల్పించింది.
వైద్యారోగ్య రంగంలో ఎదురైన సవాళ్లు, ఆసుపత్రుల నిర్వహణలో లోపాలు కూడా ఎల్‌డీఎఫ్‌కు ప్రతికూలంగా మారాయి. ఈ మౌలిక అంశాలను యూడీఎఫ్ సమర్థంగా వినియోగించుకుంది.
గల్ఫ్ దేశాల నుంచి ప్రవాస ఓటర్లు రాకపోవడం కూడా ఫలితాలను ప్రభావితం చేశాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఓటింగ్ శాతం తగ్గింది.






