17 April, 2026 | 3:07 PM

ఆన్‌లైన్ బుకింగ్‌లో తేడాలు

30-12-2025 01:15 AM

నల్లగొండ జిల్లా చిట్యాలలో కృష్ణ కాటన్ మిల్ వద్ద పత్తి రైతుల ఆందోళన

చిట్యాల, డిసెంబర్ 29 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో కృష్ణ కాటన్ మిల్ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం వద్ద సోమవారం పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. రైతులు ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ చేసుకొని, తమ పత్తిని ట్రాక్టర్ల ద్వారా మిల్లు వద్దకు తీసుకొని రాగా ఆన్‌లైన్ బుకింగ్‌లో తేడాలు రావడంతో రైతులు ఆందోళనకు దిగారు. ఒక రైతు 50 క్వింటాళ్లు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని కాటన్ మిల్‌కు తీసుకరాగా 17 క్వింటాళ్లు, మరో రైతుకు 30 క్వింటాళ్లకు బదులుగా మూడు క్వింటాళ్లు నమోదు అయ్యి ఉన్నట్లు రైతులు తెలిపారు.

రైతులందరికీ ఇదేవిధంగా చూపిస్తుండగా ఆన్‌లైన్‌లో చూపిస్తున్న ప్రకారమే పత్తి కొనుగోలు చేస్తామని మార్కెటింగ్, సీసీఐ అధికారులు అనడంతో తీసుకొచ్చిన పత్తిని ఎక్కడ అమ్ముకోవాలని సీసీఐ కేంద్రం వద్ద రైతులు ధర్నా చేశారు. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ట్రాక్టర్లను కిరాయికి మాట్లాడుకొని, పత్తిని ట్రాక్టర్లలో ఎక్కించడానికి కూలీలను పెట్టుకొని తొక్కించి కాటన్ మిల్ వద్దకు తీసుకు వచ్చాక ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు.

స్లాట్ బుక్ చేసుకున్న విధంగా కొనుగోలు జరపాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో కొనుగోలు కేంద్రం వద్ద పత్తి లోడుతో వచ్చిన ట్రాక్టర్స్ భారీగా నిలిచిపోయాయి. సీసీఐ అధికారులు, పోలీస్‌లు వచ్చి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.