ఓటర్ల జాబితా సవరణలో డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి
ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ పవన్ కుమార్ శర్మ
భూపాలపల్లి, జులై 10 (విజయక్రాంతి): ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్ పవన్ కుమార్ శర్మ సూచించారు. శుక్రవారం న్యూ ఢిల్లీ నుండి నిర్వహించిన వీడియో సమావేశంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్లతో కలిసి కార్యక్రమ పురోగతిని సమీక్షించారు. ఎన్నికల జాబితాలో పారదర్శకత ప్రజాస్వామ్యానికి కీలకమని ఆయన పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఇంటింటి సర్వేలు, బూత్ స్థాయి అధికారుల పనితీరులో ఖచ్చితత్వం అవసరమని అన్నారు. ఈ నెల 24 నాటికి ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఫారాల పంపిణీ 99.6 శాతం పూర్తయిందని, డిజిటలైజేషన్ వేగవంతం చేస్తున్నామని తెలిపారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ జిల్లాలో 99.52 శాతం ఫారాల పంపిణీ పూర్తుందని, 37.36 శాతం డిజిటలైజేషన్ జరిగిందని తెలిపారు. నిర్ణీత గడువులో ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.






