పిటిషన్ కొట్టివేత కేసీఆర్‌కు చెంపపెట్టు
- చట్టం ముందు అందరూ సమానమే..
- తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు
- ఇప్పటికైనా కేసీఆర్ కమిషన్ ముందుకు వచ్చి వాస్తవాలు చెప్పాలి
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి) : విద్యుత్ కొనుగోలుపై జరిగిన అవకతవకలపై విచారణకు ప్రభుత్వం వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌ను రద్దు చేయాలని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడం ఆయనకు చెంప పెట్టులాంటిదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ వాస్తవాలను దాచిపెట్టాలనుకునే ప్రయత్నాన్ని ఇప్పటికైనా విరమించుకోవాలని హితవు పలికారు.
చట్టముందు ఎంతటివారైనా ఒకటేనని, తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తుపెట్టుకుంటే మంచిదన్నారు. రాజ్యాంగ బద్ధంగా వేసిన కమిషన్‌ను రద్దు చేయాలనడం ఎలా వీలవుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ ఇప్పటికైనా విచారణకు హాజరై వాస్తవాలు చెప్పాలని సూచించారు. విద్యుత్ కొనుగోలుపై అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి విసిరారని, ఆ సవాల్‌పైనే రాష్ట్రప్రభుత్వం విచారణ జరుపుతోందని గుర్తుచేశారు. బీఆర్‌ఎస్ నాడు ఏ విచారణకైనా సిద్ధమని సవాల్ విసిరి, ఇప్పుడు పారిపోవడం పరికిపంద చర్య అని అభివర్ణించారు.
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌పై పిడుగులు పడకుండా ఉండేందుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు సాంకేతికతను ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. తక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉన్నా, ఎందుకు ధరకు ఎందుకు కొనుగోలు చేశారని నిలదీశారు. రాజకీయ పార్టీగా బీఆర్‌ఎస్ కొనసాగడానికి హక్కు లేదని, ఆ పార్టీని రద్దు చేయాలని తాము ఎన్నికల సంఘం ముందుకు వెళ్లుతామని స్పష్టం చేశారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలోనూ అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. పిచ్చి తుగ్లక్ పాలన చేసినందుకే రెండు తెలుగురాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజలు ఇంటికి పంపించారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కేసీఆర్ తుగ్లక్ నిర్ణయాల వల్ల రూ.30 వేల కోట్ల భారం ప్రజలపై పడిందన్నారు.






