18 July, 2026 | 5:14 AM

ప్రజావాణి దరఖాస్తులపై దృష్టి పెట్టాలి

02-07-2024 06:23 AM
  • కలెక్టర్ అనుదీప్

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 1 (విజయక్రాంతి): కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణికి వచ్చే దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి, వెంటనే సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజా వాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి కలెక్టర్  ఫిర్యాదులను స్వీకరించారు. 140 మంది నుంచి ఫిర్యాదు లు వచ్చాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటా చారి, ఆర్డీవోలు మహిపాల్, దశరథ్‌సింగ్, అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. 

చెక్కుల జారీకి లంచం డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదు..

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పలు అభివృద్ది పనులు పూర్తి చేసిన అనంతరం బిల్లులు మంజూరు చేసేందుకు లంచం డిమాండ్ చేస్తున్న చీఫ్ ప్లానింగ్ అధికారిపై జిల్లా అడిషనల్ కలెక్టర్ విజేందర్ రెడ్డికి కాంట్రాక్టర్లు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజేష్ లహోటి ఆధ్వర్యంలో సోమవారం అడిషనల్ కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతేడాది కూకట్ పల్లి నియోజకవర్గంలోని మూసాపేటలో సీడీపీ నిధులతో పలు అభివృద్ది కార్యక్రమాలను నిర్వహించినట్టు తెలిపారు.

ఈ పనులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రూ. 1.67 కోట్ల విలువైన 8 చెక్కులు విడుదలవ్వగా.. చెక్కులు తీసుకునేందుకు మేడ్చల్  మల్కాజిగిరి జిల్లా సీపీవో అధికారిని సంప్రదించగా మొత్తం ఒక్కో చెక్కుకు 1 శాతం కమిషన్ కావాలని డిమాండ్ చేస్తున్నట్టు వాపోయారు. లంచం డిమాండ్ చేసిన సీపీవోపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని, తక్షణమే చెక్కులను అందజేయాలని కోరారు. ఇదే విషయాన్ని జీహెచ్‌ఎంసీ లో జరిగిన ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేశామన్నారు. 

166 ఫిర్యాదులు.. 

జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 166 దరఖాస్తులు రాగా, బల్దియాలో 53, గ్రేటర్‌లోని 6 జోన్ల పరిధిలో మొత్తం 97 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా కూకట్‌పల్లి జోన్‌లో 37, శేరిలింగంపల్లి జోన్‌లో 33 వినతులు అందాయి. సోమవారం జీహెచ్‌ఎంసీలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజల విజ్ఞప్తులను వేగంగా పరిష్కరించేందుకు వివిధ విభాగా ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.