27 March, 2026 | 1:45 AM

జవహర్‌నగర్‌లో అందని విద్య, వైద్యం

27-03-2026 12:00 AM

రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్ సభ్యుల అసంతృప్తి 

పరిస్థితి చూసి కమిషన్ చాలా బాధపడుతోందని తీవ్ర వ్యాఖ్యలు 

బాల్యవివాహాలు, బాల కార్మికులను గుర్తించాం 

జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలి

మేడ్చల్, మార్చి 26 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్ లో బాలల సౌకర్యాల విషయంలో రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమిషన్ సభ్యులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాలలకు విద్య, వైద్యం అందడం లేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బాలల పరిస్థితి చూసి కమిషన్ చాలా బాధపడుతోందని అన్నారు. పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించడానికి జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గురువారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ విసి హాల్ లో రాష్ట్ర   బాలల హక్కుల సంరక్షణ కమీషన్ సభ్యులు సరిత, చందనలు బాలల హక్కులపై జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర బాలల హక్కుల సంరక్షణ కమీషన్ సభ్యులు చందన మాట్లాడుతూ ఇటీవల తాము జవహార్ నగర్ సందర్శించామని, అక్కడ పిల్లలకు కనీస సౌకర్యాలు లేవని గుర్తించామన్నారు. జవహర్నగర్ కార్పొరేషన్లో దాదాపు 100 కాలనీలు ఉన్నాయని, ఆ  కాలనీలలో గరిష్టంగా అన్నీ స్లమ్ ఏరియాస్ (మురికివాడలు) ఉన్నాయని,  అక్కడ పిల్లలకి కనీసం విద్య అందించలేని పరిస్థితిలో ఉన్నామన్నారు.అక్కడ పిల్లలకి , పెద్దలకి సరైన ఆరోగ్య సౌకర్యాలు లేవని అన్నారు. పిల్లలకి మనం అందించాల్సిన కనీస సౌకర్యాలు కూడా అందించలేకపోతున్నాం అని మా కమిషన్ చాలా బాధపడుతోందని అన్నారు.ఈ సమస్యలను మనం మొదటి ప్రాధాన్యతగా తీసుకోని ఒక ప్రణాళిక ప్రకారం ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు వెళ్దామన్నారు.

బాలల హక్కులరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో ముందుకు వెళితే ఆ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించగలుగుతామన్నరు.  ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసుకొని అన్ని శాఖలు తమ తమ విధులను అంకితభావంతో పని చేయడమే కాకుండా, ఆ పిల్లలు మన పిల్లలే అనే ఆలోచనతో చేస్తే తప్పకుండా ఈ సమస్యను పరిష్కరించగల మన్నారు. అక్కడ ఉంటున్న పిల్లల వివరాలను సేకరించి అందులో స్కూలుకు వెళ్లని పిల్లల వివరాలను స్కూలు మానేసిన వి పిల్లల వివరాలను తనకు అందించాలని సూచించారు. అదేవిధంగా అక్కడ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆరోగ్యం పట్ల వారికి అవగాహాన కల్పించాలన్నారు. 

అక్కడి పిల్లలకు కనీసం ఆధార్,  బర్త్, కాస్ట్ సర్టిఫికేట్ లు లేని వారు చాలా మంది ఉన్నారని, వారికోసం అక్కడే ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి అందించాలని కీసర ఆర్డీవోను ఆదేశించారు. బాల కార్మికులు, బాల్య వివాహాలు, చైల్ సెక్సువల్ అబ్యూస్, డ్రాపౌట్  వంటి అనేక సమస్యలు అక్కడ ఉన్నాయని జిల్లాయంత్రాంగం సంబంధిత శాఖలు ప్రత్యేక శ్రద్దతో ఈ సమస్యలను పరిష్కరించాలన్నారు. అందుకుగాను  ఏ విధంగా ముందుకువెళితే సమస్యలను పరిష్కరించగలమో అధికారులు వారి వారి అభిప్రాయాలను సలహాలను తెలియజేయాలన్నారు. 

చైల్ లేబర్ చాలా మంది ఉన్నారని లేబర్ డిపార్ట్ మెంట్ వారిని గుర్తించి వివరాలు అందించాలని ఆదేశించారు. ఆపరేషన్ ముస్కాన్ తరహాలో ఇప్పుడు కూడా ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేసి చైల్ లేబర్ ను గుర్తించాలన్నారు. అవసరమైతే కమీషన్ ఛైర్మన్ ద్వారా సంబంధిత అధికారులకు, ఉన్నతాధికారుల దృష్టికి ఈసమస్యలను తీసుకువెళ్లి వారి సహాయ సహాకారాన్ని కూడా కోరుతామన్నారు. జిహెచ్‌ఎంసి, రెవెన్యూ, పోలీసు, విద్యా,  వైద్య, లేబర్, మహిళ శిశు సంక్షేమ శాఖలు అన్ని సమన్వయంతో పని చేసి జవహార్ నగర్ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలని కోరుకున్నారు.

అందుకుగాను తమ వంతు సహాకారం అన్ని వేళల అన్ని విధాల అందిస్తామని సభ్యులు తెలిపారు.  జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ జవహార్ నగర్ సమస్యను ఒక స్పెషల్ డ్రైవ్ ద్వారా అన్ని శాఖల సమన్వయంతో తప్పకుండా పరిష్కరిస్తామని అందుకు అవసరమైన పూర్తి సహాకారాన్నీ అన్ని శాఖల ద్వారా తీసుకొని విజయవంతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ చంద్రావతి,  కీసర ఆర్డిఓ రాజేష్, డిఈఓ విజయ కుమారి, డిడబ్ల్యూఓ శారద, పోలీసు, లేబర్, వైద్య శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.