27-01-2026 12:00:00 AM
చిట్యాల, జనవరి 26 : నకిరేకల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు నిర్వహించిన వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీ పనిముట్ల పంపిణీ కార్యక్రమంలో నకిరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం పాల్గొని లబ్ధిదారులకు సబ్సిడీపై మంజూరైన వ్యవసాయ యంత్రాలను సోమవారం పంపిణీ చేశారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసి రైతుల ఆర్థికాభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతోనే ప్రస్తుత ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణకు సబ్సిడీని ప్రవేశపెట్టిందని, గత ప్రభుత్వ హయాంలో రైతులకు ఎలాంటి సబ్సిడీలు ఇవ్వకపోవడంతో పాటు, రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలుచేశారని విమర్శించారు.
అలాగే ఇంటి ఇంటికి నల్లా హామీని కూడా అమలు చేయలేదని గుర్తుచేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, కొత్త రేషన్ కార్డుల జారీ వంటి సంక్షేమ పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు.100 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం చేపట్టడం,100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన విద్యా, వైద్య సేవలు అందిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.