ప్రభుత్వ పాఠశాలలకు డ్యుయల్ డెస్క్ బెంచీల పంపిణీ
భిక్కనూర్,(విజయక్రాంతి): కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి తల్లిదండ్రుల పేరిట ఏర్పాటు చేసిన కాటిపల్లి రాజిరెడ్డి జనసేన ట్రస్ట్ ఆధ్వర్యంలో భిక్కనూర్ మండలంలోని పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలకు రెండో విడత డ్యుయల్ డెస్క్ బెంచీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దమల్లారెడ్డి గ్రామానికి 74, కంచర్లకు 30, ఇసన్నపల్లికి 35, బస్వాపూర్‌కు 65 డ్యుయల్ డెస్క్ బెంచీలు అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. విద్యార్థులు నేలపై కాకుండా బెంచీలపై కూర్చొని సౌకర్యవంతమైన వాతావరణంలో చదువుకునేలా డ్యుయల్ డెస్క్‌లను పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ట్రస్ట్ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉపయోగపడే ఈ కార్యక్రమాన్ని గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.






