19-11-2025 08:51:55 AM
హైదరాబాద్: కోటి మంది మహిళలకు కోటి చీరలను అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. దీంతో 18 ఏళ్లు దాటి తెల్లరేషన్ కార్డున్న మహిళలందరికీ చీరలు అందనున్నాయి. బుధవారం ఇందిరా గాంధీ జయంతి(Indira Gandhi Jayanti) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించనున్నారు. చీరలను పూర్తిగా సిరిసిల్ల చేనేత కార్మికులు తయారు చేస్తున్నారు. ఉత్పత్తి ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఉత్పత్తికి అనుగుణంగా రెండు దశలుగా చీరల పంపిణీ చేపట్టాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
తొలి దశలో గ్రామీణ ప్రాంతాల్లో చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇందిరా గాంధీ జయంతి నుంచి డిసెంబరు 9 తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రెండవ దశలో పట్టణ ప్రాంతాల్లో మార్చి 1నుంచి మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) వరకు మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో చీరల నాణ్యత విషయంలో రాజీపడొద్దని, మహిళలకు నాణ్యమైన చీరలను అందించాలని అధికారులను ఆదేశించారు.
సాంకేతికను వినియోగించుకుని ఇందిరమ్మ చీరల పంపిణీ పారదర్శకంగా జరిగేలా చూడాలని, పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. బుధవారం ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ చీరల పంపిణీని(Distribution of Indiramma sarees) లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం సెక్రటేరియట్ నుంచి గ్రామీణ ప్రాంత మహిళలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి మాట్లాడుతారు. వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందుబాటులో ఉన్న కలెక్టర్లు పాల్గొనాలన్నారు.