వనపర్తికి మరో 2వేల ఇందిరమ్మ ఇండ్లు
- రెండో విడత మంజూరు పత్రాల పంపిణీ..
- రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల ఇండ్ల నిర్మాణం కొనసాగుతోంది
- వనపర్తి నియోజకవర్గానికి రూ.275 కోట్లతో నిర్మాణాలు
- సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం, ప్రెస్ క్లబ్కు మంత్రి పొంగులేటి హామీ
- ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్మాణాలు: మంత్రి జూపల్లి
- ప్రతి కుటుంబానికి శాశ్వత గృహం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి వాకిటి శ్రీహరి
వనపర్తి, జూలై 8 (విజయక్రాంతి): గుడిసెల్లో నివసిస్తున్న ప్రతి పేద కుటుంబానికి శాశ్వత గృహం కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో కలిసి మొదటగా వనపర్తి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం పరిధిలో రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో రూ.10 కోట్లతో చేపట్టనున్న రాజాగారి బంగ్లా పునరుద్ధరణ పనులకు మంత్రి శ్రీకారం చుట్టారు. రూ.2. 25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రేవల్లి మండల సముదాయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రులకు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్య నాయక్, జిల్లా ఎస్పీ డి. సునీతారెడ్డి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.
అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటి విడతలో 4.5 లక్షల ఇళ్లు, రెండో విడతలో 3.5 లక్షల ఇళ్లు కలిపి మొ త్తం 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
వనపర్తి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.275 కోట్లు కేటాయించామని, రెండో విడతలో మరో 2 వేల ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు వనపర్తిలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ భవనం, ప్రెస్ క్లబ్ భవనం మంజూరుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, మట్టి విషయంలో లబ్ధిదారులను ఎలాంటి ఇబ్బందులకు గురిచే యొద్దని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇళ్ల నిర్మాణం.. మంత్రి జూపల్లి
గత ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించడంలో విఫలమైందని మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని కొనసాగిస్తోందని చెప్పారు. లబ్ధిదారులు అప్పులు చేయకుండా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ప్రభుత్వంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని కోరారు.
ప్రతి కుటుంబానికి శాశ్వత గృహం కల్పించడమే లక్ష్యం.... మంత్రి శ్రీహరి
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గుడిసెల్లో నివసించే ప్రతి కుటుంబానికి శాశ్వత గృహం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
మరో 2 వేల ఇండ్లు మంజూరు సంతోషకరం... ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి నియోజకవర్గానికి రెండో విడతలో 2 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం సంతోషకరమని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. అదనంగా మరో 2 వేల ఇళ్లు, జిల్లాలోని 32 ఎస్టీ హ్యాబిటేషన్లకు 640 ఇళ్లు మంజూరు చేయాలని మంత్రులను కోరారు. అలాగే వనపర్తి బైపాస్ రహ దారి, పెబ్బేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, మర్రికుంట భూసమస్యల పరిష్కారం, క్రీడల అభివృద్ధి, ప్రెస్ క్లబ్ భవనం తదితర అంశాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, అదనపు కలెక్టర్లు ఖీమ్య నాయక్, వినోద్ కుమార్, జిల్లా ఎస్పీ సునీతారెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.






