వరుణుడి కోసం అన్నదాత ఎదురుచూపు..
పత్తి పంట కాపాడుకునేందుకు నానా పాట్లు
అలంపూర్, జూలై 8: వర్షాలు లేక ఖరీఫ్ రైతుల ఆందోళన రోజురోజుకూ పెరుగుతోంది. జూన్ నెలలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పత్తి పంట ఎండుముఖం పట్టింది. దీంతో మానవపాడు శివారులోని ఓ రైతు తన నాలుగు ఎకరాల పత్తి పంటను కాపాడుకునేందుకు సమీపంలో ఉన్న జూరాల కాలువలో అరకొర నీటిని మోటారు సాయంతో పొలానికి మళ్లిస్తూ సాగును నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.ఇప్పటికైనా వర్షాలు కురవకపోతే పంట పూర్తిగా దెబ్బతింటుంది‘ అని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఖరీఫ్ సాగు ఊపందుకున్న ఈ సమయంలో వరుణుడు ముఖం చాటేయడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పంటలను కాపాడుకోవడానికి బోర్లు, కాలువల్లో మిగిలిన కొద్దిపాటి నీటిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.రానున్న రోజుల్లో మంచి వర్షాలు కురిసి సాగుకు ఊరట కల్పించాలని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.






