13 August, 2026 | 3:45 AM

ప్రతి ఇంటికీ 5 మొక్కల పంపిణీ ప్రారంభం...

13-08-2026 01:56 AM

ఆలేరు, ఆగస్టు 12:  మండలంలోని శ్రీనివాసపురం గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి 5 మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ వడ్ల శోభన్ బాబు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వడ్ల శోభన్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని కోరారు. చెట్ల వల్ల మానవాళికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని, పెద్ద సంఖ్యలో మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణ సమతుల్యత ఏర్పడి సకాలంలో వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపారు.

మనం పీల్చే స్వచ్ఛమైన గాలి చెట్ల వల్లే లభిస్తుందని, చెట్లను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ తరాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం సుమారు 24 శాతం ఉండగా, ప్రభుత్వం చేపట్టిన హరితహారం వంటి కార్యక్రమాల ద్వారా ప్రస్తుతం 31 శాతానికి పెరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటి సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి భవాని, వార్డు సభ్యురాలు చౌడబోయిన లావణ్య, చౌడబోయిన నరసయ్య, సత్యనారాయణ, హరికృష్ణ, రజిత తదితరులు పాల్గొన్నారు.